Share News

రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి

ABN , Publish Date - May 24 , 2025 | 11:01 PM

ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి
రిజర్వాయర్‌ భూసేకరణ అవగాహన సదస్సులో మాట్లాడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ప్రజా జీవన మార్పులను కోరేవాడే నిజమైన నాయకుడు

- అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

బల్మూరు, మే 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో శనివారం ఉమామహేశ్వర రిజర్వాయర్‌ భూసేకరణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్‌ పూర్తి చేసేందుకు లక్ష కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఇందులో భాగంగా బల్మూరు, అనంతవరం, అంబగిరి గ్రామాల సమీపంలో 2.6, 7 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టేందుకు 1,980ఎకరాల భూములను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తైతే 5 మండలాలకు కలిపి 57,600 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. రూ.1.500కోట్లతో రిజర్వాయర్‌ పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భూమిని కోల్పోయే రైతుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయమైన భూములు ఇవ్వాలి, లేని పక్షంలో రూ.20 నుంచి రూ.30లక్షల వరకు ఒకేసారి డబ్బులు చెల్లించాలని, కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ అరుణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:01 PM