Share News

చదువు, సాగునీరే మా ఎజెండా

ABN , Publish Date - Sep 03 , 2025 | 10:52 PM

‘ఏళ్లుగా పాలమూరు జిల్లా వలసలకు మారుపేరుగా ఉంది. బాక్రానంగల్‌, నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎ్‌సపీ ఇలా దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా తట్ట పని, మట్టి పని, పార పనిలో పాలమూరు వలస జీవుల పాత్ర ఉంది.

చదువు, సాగునీరే మా ఎజెండా
మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో(ఎడమ నుంచి) ఎమ్మెల్యే జీఎంఆర్‌, కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేఘారెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి

అవి లేకపోవడం వల్లే పాలమూరు ప్రజలు ఏళ్లుగా వలసపోయారు

కేసీఆర్‌ను ఎంపీని చేసినా న్యాయం జరుగలేదు

ఎత్తిపోతల పథకాలు పూర్తి కాలేదు.. పీయూ పీజీ కాలేజీలా మిగిలిపోయింది

పాలమూరు బిడ్డ సీఎం అయ్యాక లా, ఇంజనీరింగ్‌ కాలేజీలు, ట్రిపుల్‌ ఐటీ వచ్చాయి

14 నియోజకవర్గాలకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరు చేశాం

విద్య, సాగు నీటి రంగాలకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిధులు

నారాయణపేట- కొడంగల్‌ లిఫ్టునకు ఎన్‌జీటీకి వెళ్లి అడ్డుపుల్లలు వేస్తున్నారు

పేదరికానికి పాలమూరు ఎగ్జిబిషన్‌ కావొద్దు.. ప్రగతి పథానికి వేదిక కావాలి

మూసాపేటలో ఎస్‌జీ కార్నింగ్‌ యూనిట్‌ ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 3 (ఆంధ్రజ్యోతి) ప్రతినిధి): ‘ఏళ్లుగా పాలమూరు జిల్లా వలసలకు మారుపేరుగా ఉంది. బాక్రానంగల్‌, నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎ్‌సపీ ఇలా దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా తట్ట పని, మట్టి పని, పార పనిలో పాలమూరు వలస జీవుల పాత్ర ఉంది. కష్టపడేతత్వం ఉన్న పాలమూరు ప్రజలు ఉన్నత స్థాయిలో రాణించకపోవడానికి ఎ డ్యుకేషన్‌, ఇరిగేషన్‌ లేకపోవడమే ప్ర ధాన కారణం. ఇప్పుడు ప్రజా ప్ర భుత్వం వాటినే ఎజెండాగా తీసుకుని పని చేస్తుంది. పేదరికానికి ఇకపై పాలమూరు ఎగ్జిబిషన్‌ కాదు. ప్రగతి పథానికి వేదిక కావాలి’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేటలో ఉన్న ఎస్‌జీ కార్నింగ్‌ పరిశ్రమలో రెండో యూనిట్‌ ప్రారంభోత్సవానికి సీఎం బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా ఇకపై నూతన పరిశ్రమలకు వేదిక అవుతుందని, జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలకు ఉపాధి ఇక్కడ దొరుకుందని తెలిపారు. ఏళ్లుగా పాలమూరు నిరాదరణకు గురైందన్నారు. అందుకే కేసీఆర్‌ను పాలమూరు నుంచి గెలిపిస్తే.. ఈ ప్రాం తానికి సముచిత న్యాయం చేయలేదన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని అన్నారు. పాలమూరు యూనివర్సిటీ కాంగ్రెస్‌ హ యాంలో వస్తే దాన్ని పట్టించుకోకుండా పీజీ కాలేజీకి పరిమితం చేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్‌, లా కాలేజీలు తెచ్చామని అన్నారు. కొత్తగా డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పాలమూరులో ట్రిపుల్‌ ఐటీ కాలేజీ మంజూరు చేశామని, అద్భుతమైన క్యాంపస్‌ త్వరలో రూపుదిద్దుకుంటుందని అన్నారు. 14 నియోజకవర్గాలకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరు చేశామని, 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,800 కోట్లతో వాటిని నిర్మించబోతున్నామని తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారని, ఆ తర్వాత 75 ఏళ్లకు పాలమూరు బిడ్డకు సీఎం అవకాశం వచ్చిందన్నారు. ఈ అవకాశం తప్పితే మరో 75 ఏళ్లవుతుందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో వేలాది ఎకరాలను భూస్వాముల నుంచి తీసుకుని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అసైన్డ్‌ భూములగా పంచారన్నారు. కొంతమంది వాటినిఇ సద్వినియోగం చేసుకుంటే.. కొందరు నీరు లేక సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని, విద్యకు నిధుల కొరత లేదన్నారు.

ప్రాజెక్టులకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిధులు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, ప్రస్తుతం గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నామని సీఎం తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం కోసం జీవో నెంబర్‌ 69ను జారీ చేయించామని, కానీ పదేళ్లు దాన్ని తొక్కిపెట్టి అన్యాయం చేశారని అన్నారు. ప్రస్తుతం రూ.4 వేల కోట్లతో టెండర్లు పిలుచుకుని, భూసేకరణ చేస్తుంటే నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసులు వేసి.. అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భూసేకరణకు సంబంధించి వివాదాలు వస్తున్నాయని, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో రైతులను ఒప్పించాలని సూచించారు. రైతులు తమ దగ్గరికి రావడం కాదని, రైతుల దగ్గరకే వెళ్లి వారికి ఏం కావాలో తెలుసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎకరాకు రూ.11 లక్షల కంటే పరిహారం ఎక్కువగా ఎక్కడా ఇవ్వలేదని, ఇక్కడ రూ.14 లక్షల పరిహారం ఇస్తున్నామన్నారు. మంత్రి, ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి.. చెబితే న్యాయమైన పరిహారం ఇద్దామని అన్నారు. కోస్గిలో పట్టణానికి దగ్గరగా ఉండి, రియల్‌ ఎస్టేట్‌ విలువ ఎక్కువగా ఉండటం వల్ల రూ.20 లక్షల పరిహారం ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి చేసుకోకుంటే ఇబ్బంది అవుతుందని అన్నారు. గతంలో నాయకత్వ లోపం, నిధుల అలసత్వంతో పాలమూరు వెనుకబడిందన్నారు. ఇప్పుడు మన జిల్లాకు.. మనం చేసుకునే మేలు అభివృద్ధి చేయడమేనన్నారు. గతంలో టోనీ బ్లేయర్‌, ఇతర విదేశీ వ్యక్తులు వస్తే పాలమూరు కరువును ఎగ్జిబీషన్‌గా చూపించారని, ప్రతీవాడు దత్తత తీసుకుంటానని చెప్పినా అభివృద్ధి జరగలేదన్నారు.

హైదరాబాద్‌- బెంగళూరు ఢిపెన్స్‌ కారిడార్‌..

బ్రహ్మోస్‌ మిసైల్‌ తయారీ యూనిట్‌ స్థాపనకు రక్షణశాఖ ఈ ప్రాంతంలో పరిశీలన జరిపిందని, త్వరలో ఈ యూనిట్‌ ఏర్పాటైతే.. మరిన్ని రక్షణరంగ పరిశ్రమలు ఏర్పాటవుతాయని అన్నారు. దీనికి స్కిల్డ్‌ వర్కర్ల అవసరం ఉందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుపై నివేదిక అందజేయాలని, అప్పుడే ఉన్నత ఉద్యోగాలు వస్తాయని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ చిన్నారెడ్డికి సూచించారు. ఇప్పటికే దేవరకద్ర నియోజకవర్గంలో డ్రైపోర్టు ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని, హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిని ఢిఫెన్స్‌ కారిడార్‌గా మార్చుతామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి పంపించాలని, ఏ పరిశ్రమకు ప్రతిపాదన వచ్చినా పాలమూరులోనే పెట్టే విధంగా ఈ ప్రాంత బిడ్డగా కృషి చేస్తానని అన్నారు. కుర్చీలో కూర్చున్న వారు తమను నమ్ముకున్న వారికి ఏదో చేయాలని ఉంటుందని, తనకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే పెడతానన్నారు.

ఇండిస్ర్టియల్‌ కారిడార్‌ మంజూరు చేయండి: మధుసూదన్‌రెడ్డి

దేవరకద్ర నియోజకవర్గంలో 44వ జాతీయ రహదారి 68 కిలోమీటర్ల మేర ఉందని, ఈ రహదారి వెంట ఇండస్ర్టియల్‌ కారిడార్‌ మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మదుసూధన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామని, కార్నింగ్‌ పరిశ్రమలో కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే వారు ఒప్పుకున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నియోజకవర్గం విద్య, వైద్యంలో వెనుకబడిందని అన్నారు. ప్రస్తుతం దేవరకద్రకు డిగ్రీ కాలేజీ మంజూరైందని, కోర్టు వచ్చిందని, రూ.110 కోట్లతో కురుమూర్తి ఆలయానికి ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు మంజూరై.. పనులు నడుస్తున్నాయని చెప్పారు. వచ్చే బ్రహోత్సవాల నాటికి ఆ పనులు పూర్తి చేయిస్తామని అన్నారు. ఇప్పటికే బ్రహ్మోస్‌ మిసైల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు పరిశీలన జరిగి.. సూత్రప్రాయమైన అంగీకారం వచ్చిందని చెప్పారు. రూ.300 కోట్ల విలువైన భూములను ఇవ్వనున్నట్లు తెలిపారు. లా, ఇంజనీరింగ్‌, ట్రిపుల్‌ ఐటీ, ఏటీసీలు జిల్లాకు మంజూరయ్యాయని అన్నారు. దేవరకద్రలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ మంజూరు చేయాలని, దేవరకద్ర కొత్త మునిసిపాలిటీకి రూ.30 కోట్లు ఇవ్వాలని, కొత్తకోటకు డిగ్రీ కాలేజీ ఇవ్వాలని, నియోజకవర్గంలోని పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. జాతీయ రహదారి ఉన్నందున రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇప్పటికే దేవరకద్రకు వంద పడకల ఆస్పత్రి, కొత్తకోటకు 30 పడకల ఆస్పత్రి మంజూరైందని, పనులు ప్రారంభించామని తెలిపారు.

Updated Date - Sep 03 , 2025 | 10:52 PM