Share News

అంతరాయం లేకుండా తాగునీరివ్వాలి

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:01 AM

జిల్లాలో తాగునీరు పుష్కలంగా ఉందని, నీటి సరఫరాకు పంపుసెట్లన్నీ దిగ్విజయంగా పని చేస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

అంతరాయం లేకుండా తాగునీరివ్వాలి
అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- సమస్య పరిష్కారానికి కలెక్టర్లకు రూ.కోటి చొప్పున నిధులు

- గత రబీలో సీఎంఆర్‌ ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టండి

- సమీక్షా సమావేశంలో ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తాగునీరు పుష్కలంగా ఉందని, నీటి సరఫరాకు పంపుసెట్లన్నీ దిగ్విజయంగా పని చేస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఏ ఒక్క రోజుకూడా ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బంది కలుగొద్దని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌, పర్యాటక అభివృద్ధి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సన్న బియం పంపిణీ, గ్యాస్‌, విద్యుత్‌ సబ్సిడీపై ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో తాగునీటి సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తాగునీటికి అంతరాయం కలుగకుండా చూడాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ఇబ్బంది లేదని, నిర్వహణలో కొన్ని లోపాలు మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించుకొని నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి తాగునీటి కోసం రోజూ ఎంత వినియోగిస్తున్నారని అడిగారు. అత్యవసర పరిస్థితిలో తాగునీటి సరఫరాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్‌లకు రూ.కోటి నిధులు మంజూరు చేశారన్నారు. ఇంకా అవసరమైతే ఎమ్మెల్యేల ఎస్‌డీఎఫ్‌ నిధులను వినియోగించుకోవచ్చని సూచించారు.

తరుగు తీయొద్దు

రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలన్నారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటిని తూకం వేసి, రశీదు ఇవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితులలో తరుగు తీయొద్దన్నారు. గత రబీలో సీఎంఆర్‌ ఇవ్వకుండా వడ్లు అమ్ముకున్న మిల్లర్ల నుంచి రావాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేయాలని ఆదేశించారు. అవసమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సూచించారు. గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై సమీక్షిస్తూ, మిగిలిన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా ప్రభుత్వ సబ్సిడీని అందించాలన్నారు. అందుకు యంత్రాంగం లబ్ధిదారుల వివరాలతో నివేదికను రూపొందించి 15 రోజుల్లో ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. త్వరలోనే నూతన రేషన్‌ కార్డులు అందిస్తామన్నారు.

పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టాలి

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మంజూరు చేసిన పను లు వెంటనే చేపట్టాలన్నారు. పిల్లలమర్రి, కోయిల్‌సాగర్‌ల వద్ద పనులకు టెండర్‌లను పిలిచి, ప్రారంభించాలని ఆదేశించారు. మినీ శిల్పారామంలో ఉన్న ఫంక్షన్‌ హాల్‌ సౌండ్‌ ప్రూఫ్‌కు ప్రతిపాదనలు ఇవ్వాలని ఇంజనీరింగ్‌ అధికారులకు చెప్పారు. మన్యంకొండలో హరిత హోట ల్‌, కల్యాణ మండపం పనులు పూర్తి చేయాలన్నారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, ఐలాండ్‌ పనులకు రీ-ఎస్టిమేట్‌ చేయాలని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న టూరిజం హోటల్‌ పనుల ప్రగతిని సమీక్షించారు.

బలవంతంగా ప్లాట్లను తీసుకున్నారు

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ శిల్పారామంలో నాడు బలవంతంగా ప్లాట్లను ఓనర్స్‌ ద్వారా తీసుకున్నారని, వాటికి నష్ట పరిహారం ఇవ్వాల్సిఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆ ప్లాట్లపై విచారణ చేసి, 15 రోజుల్లో రిపోర్టు అందించాలని మంత్రి సూచించారు. రూ.48.99 కోట్లతో పెద్ద చెరువు దగ్గర ఐలాండ్‌, నెక్లెస్‌ రోడ్డు నిర్మాణం, సుందరీకరణ పనులు చేపట్టేందకు గతంలో ఎస్టిమేట్‌ చేశారన్నారని, రూ.7 కోట్ల పనులు పూర్తి కాగా, మిగతావి ఆగిపోయాయని అధికారులు మంత్రికి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రీ-ఎస్టిమేషన్‌ తయారు చేసి 3 వారాల్లో నివేదిక ఇవ్వాలన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి పనులు, కోయిల్‌సాగర్‌ పర్యాటక పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్‌, మోహన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత, ముడా చైర్మన్‌ లక్షణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:01 AM