తాగునీటికి తండ్లాట
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:37 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న పాలమూరు నగరాన్ని తాగునీటి ఎద్దడి వేధిస్తోంది. దశాబ్దాల కిందట వేసిన పైప్‌లైన్‌లే వాడుతుండటంతో అవి తరచూ పగిలిపోయి, సమస్య ఉత్పత్నమవుతోంది. 8 నుంచి 10 రోజులుగా నగరంలోని మూడోవంతు కాలనీలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయి జనం అల్లాడుతున్నారు.
పాలమూరు నగరంలో 8 రోజులుగా నిలిచిన సరఫరా
రామిరెడ్డిగూడ, చౌదర్‌పల్లి గేట్ దగ్గర పగిలిన పైపులు
20 ఏళ్ల క్రితం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నగరానికి తాగునీరు సరఫరా
ఆ పైప్‌లైన్‌కే మిషన్‌భగీరథ కనెక్షన్
దాంతో తరచూ సమస్యలు
జడ్చర్ల నుంచి 8-10 ఎంఎల్‌డీలు.. మన్యంకొండ నుంచి 22 ఎంఎల్‌డీల నీరు
మరో 10 ఎంఎల్‌డీల నీరు వస్తే రోజూ అందించేందుకు అవకాశం
మహబూబ్‌నగర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వేగంగా అభివృద్ధి చెందుతున్న పాలమూరు నగరాన్ని తాగునీటి ఎద్దడి వేధిస్తోంది. దశాబ్దాల కిందట వేసిన పైప్‌లైన్‌లే వాడుతుండటంతో అవి తరచూ పగిలిపోయి, సమస్య ఉత్పత్నమవుతోంది. 8 నుంచి 10 రోజులుగా నగరంలోని మూడోవంతు కాలనీలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయి జనం అల్లాడుతున్నారు. దాదాపు 3 లక్షల జనాభా ఉన్న నగరానికి రెండు సోర్సుల ద్వారా మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. మన్యంకొండ నుంచి రామిరెడ్డిగూడ మీదుగా 22 ఎంఎల్‌డీల నీరు వస్తుండగా, జడ్చర్ల నుంచి 8-10 ఎంఎల్‌డీల నీరు వస్తోంది. ప్రస్తుతం మన్యంకొండ నుంచి వచ్చే తాగునీటి పైప్‌లైన్‌లు వారం రోజులుగా మరమ్మతులకు గురి కావడంతో సరఫరా నిలిచిపోయింది. చౌదర్‌పల్లి గేట్ వద్ద వారం కిందట పైప్‌లైన్ పగిలిపోవడంతో మూడు రోజుల మరమ్మతు చేసి, సరఫరా ప్రారంభించారు. తర్వాత మళ్లీ వెంటనే రామిరెడ్డిగూడ వద్ద పైప్‌లు పగిలిపోయాయి. ఒకమీటర్ డయా పైప్‌లు కావడంతో మరమ్మతులకు చాలాటైమ్ పడుతోంది. మూడోజులుగా నగర కమిషనర్‌తోపాటు యంత్రాంగం అంతా అక్కడే పనులు చేయిస్తున్నారు. ఇప్పుడు మరమ్మతులు పూర్తికాగా, మళ్లీ పైపులు ఎక్కడా పగిలిపోకుండా ఉంటే.. గురువారం నుంచి సరఫరా మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు.
20 ఏళ్ల క్రితం పైపులు కావడంతో..
నగరానికి గతంలో రామన్‌పాడ్ ద్వారా తాగునీరు సరఫరా చేసేవారు. 20 06-07లో నాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హయాంలో కోయిల్‌సాగర్ తాగునీటి పథకాన్ని చేపట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ పథకం ద్వారా మ న్యంకొండ వద్ద ట్యాంకు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రామిరెడ్డిగూడ ద్వారా నగరానికి నీటిని అందిస్తున్నారు. మన్యంకొండ నుంచి కొత్త పైప్‌లైన్ వేసి, రామిరెడ్డిగూడ నుంచి కోయిల్‌సాగర్ నీటిని అందించే పైపులకు మిషన్‌భగీరథ పైపులతో కనెక్షన్ ఇచ్చారు. రామిరెడ్డిగూడ నుంచి నగరానికి ఉన్న పైపులు పాతవే కొనసాగిస్తున్నారు. అవి దాదాపు 20 ఏళ్లవి కావడంతో జాయింట్‌ల వద్ద పగిలిపోయి, సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నగరంలోని 30 స్టోరేజీ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని కాలనీలకు సరఫరా చేస్తున్నారు. మన్యంకొండ నుంచి వచ్చే నీటి సరఫరాకు 22 ట్యాంకులు, జడ్చర్ల నుంచి వచ్చే నీటికి 8 ట్యాంకులను వినియోగిస్తున్నారు. జడ్చర్ల నుంచి సరఫరా అయ్యే నీరు ఏనుగొండ, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ లక్ష్మీనగర్, మెట్టుగడ్డ, మర్లు ప్రాంతాలకు సరఫరా అవుతుండగా.. మిగతా కాలనీలకు మన్యంకొండ ద్వారా వచ్చే నీరు సరఫరా అవుతోంది. 70 శాతం కాలనీలకు మన్యంకొండ ద్వారానే వస్తోంది.
పని చేయని పవర్ బోర్లు
నగరంలో దాదాపు 600 వరకు పవర్ బోర్లు ఉన్నాయి. పలుచోట్ల ఇవి పని చేయడం లేదు. అన్ని వాడుకలో ఉంటే మిషన్ భగీరథ సరఫరాలో ఇబ్బందులు వచ్చినప్పుడు పవర్ బోర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గతంలో పవర్ బోర్లను పూర్తిగా నిలిపివేయడంతో తీవ్ర విమర్శలు రాగా, మళ్లీ పునరుద్ధరించారు. ఎక్కడైనా పని చేయకుంటే మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు.
మరో 10 ఎంఎల్‌డీలు పెంచుకుంటే
ప్రస్తుతం నగరానికి రెండు సోర్సుల ద్వారా దాదాపు 30 ఎంఎల్‌డీల నీరు వస్తుండగా మరో 10 ఎంఎల్‌డీల నీటిని పెంచుకుంటే రోజూ అన్ని కాలనీలకు నీ టిని సరఫరా చేయొచ్చు. జడ్చర్ల నుంచి 15 ఎంఎల్‌ఎల్‌డీల వరకు అనుమతులున్నా ప్రస్తుతం 8-10 ఎంఎల్‌డీలనే వినియోగించుకుంటున్నాము. దీనిపై యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సోషల్ మీడియాలో వాటర్‌వార్
నగరంలో వారం నుంచి పది రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో సామాజిక మాధ్యమాలలో వాటర్‌వార్ కొనసాగుతోంది. పాలమూరుకు మళ్లీ తాగునీటి కష్టాలు వచ్చాయని, బిందెలతో రోడ్లపైకి రావాలని, ట్యాంకర్ల వద్ద కొట్లాటలు చూడాలేమో అంటూ బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు మీ వల్లే సమస్యలు వస్తున్నాయని, నాసిరకం పైపుల వల్లే అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మరమ్మతులు జరుగుతున్నాయని ప్రజలు కాస్త సంమయమనం పాటించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి బుధవారం పత్రికాప్రకటన విడుదల చేశారు. వారం రోజులుగా పైపుల మరమ్మతుల కారణంగా నీటి సరఫరా లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అన్ని వార్డులలో ప్రజలకు అందుబాటులో తాగునీటి సమస్యలు లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. బోర్లు రిపేర్ ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.