Share News

ముసాయిదా నేడు విడుదల

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:18 PM

కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర, మద్దూర్‌ మునిసిపాలిటీలతోపాటు మహబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థలో వార్డుల విభజన ముసాయిదా మంగళవారం విడుదల కావాల్సి ఉండగా, బుధవారానికి వాయిదా పడింది.

ముసాయిదా నేడు విడుదల
పాలమూరు నగర పాలక సంస్థ కార్యాలయం

కొత్త పురపాలికలు, నగర పాలికలో వార్డుల విభజనపై నేడు జాబితా

పాలమూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లు.. దేవరకద్రలో 12 వార్డులు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర, మద్దూర్‌ మునిసిపాలిటీలతోపాటు మహబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థలో వార్డుల విభజన ముసాయిదా మంగళవారం విడుదల కావాల్సి ఉండగా, బుధవారానికి వాయిదా పడింది. పాలమూరు నగర పాలక సంస్థలో రాత్రి ఏడు గంటలకు ప్రచురిస్తారని చెప్పినా జాబితా తయారికీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నందున జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. వార్డుల విభజనపై అభ్యంతరాలు, సలహాల కోసం ముసాయిదా విడుదల కానుండటంతో ఆయా పురపాలికలు, పాలమూరు నగర పాలికలో రాజకీయ సందడి నెలకొంది.

అందరిలో టెన్షన్‌

పాలమూరు కార్పొరేషన్‌లో 49 వార్డులు ఉండగా ఇప్పుడు 60 డివిజన్‌లు అయ్యాయి. ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించిన జాబితా రూపొందించారు. పాత మునిసిపాలిటీతోపాటు కొత్తగా 3 వేల ఓటర్లున్న జైనల్లీపూర్‌, దివిటిపల్లి గ్రామ పంచాయతీలను నగర పాలక సంస్థలో విలీనం చేశారు. ఇదివరకు ఒక్కో వార్డుకు 3,200-3,900 వ రకు ఓటర్లు ఉండగా, కార్పొరేషన్‌లో మా త్రం ఓటర్ల సంఖ్య తగ్గుతోంది. ఓటర్లు పెద్దగా పెరగకపోగా డివిజన్‌లు మాత్రం 11 పెరగడంతో సగటున ఒక్కో డివిజన్‌కు 3,200-3,300 ఓటర్లకన్నా మించి ఉండే పరిస్థితి లేదు. డివిజన్‌ల సంఖ్య పెరగడంతో ఇదివరకు కౌన్సిలర్‌లుగా ఉన్నవారితోపాటు కొత్తగా పోటీ చేయాలనుకునే ఆశావహుల్లో తమ వార్డు ఏమైనా మారిందా అన్న టెన్షన్‌ నెలకొంది. జాబితా కోసం అంతా ఎదురుచూస్తున్నారు. దేవరకద్రను 12 వార్డులుగా విభజించారు. ఒక్కో వార్డులో 810-870 వరకు ఓటర్లు ఉన్నారు. దేవరకద్ర గ్రామ పంచాయతీ ఓటర్లను 7 వార్డులుగా, చౌదర్‌పల్లిని 2 వార్డులుగా విభజించారు. రెండో వార్డులో కొంతభాగం దేవరకద్ర కలిసింది. 3 నుంచి 7, అదేవిధంగా 10, 11 వార్డులు దేవరకద్ర వార్డులు ఉండగా, పెద్ద గోప్లాపూర్‌, మీనుగోనిపల్లి, బల్సుపల్లి గ్రామాలను ఒక్కో వార్డుగా విభజించారు. వార్డుల జాబితా వెలువడటంతో ఆశావహులు తమకు అనుకూలతలు, ప్రతికూలతలను లెక్కలేసుకునే పనిలో పడ్డారు. ప్రజలనుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు గడువు ఉండటంతో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ఈనెల 21న ఫైనల్‌ నోటిషికేషన్‌ వెలువడనుంది.

Updated Date - Jun 03 , 2025 | 11:18 PM