రేకుల షెడ్డులో వసతి గృహం
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:40 PM
గోదాం లాంటి రేకుల షెడ్డులో నిర్వహించిన వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అవస్థలు పడుతున్న విద్యార్థులు
గోపాల్‌పేట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : గోదాం లాంటి రేకుల షెడ్డులో నిర్వహించిన వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో రెండు ఎస్సీ, ఒక బీసీ బాలుర, మరో బాలికల వసతి గృహాలున్నాయి. నాలుగు హాస్టళ్లలో మూడు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు 400 మంది ఉన్నారు. వాటిల్లోని బీసీ వసతి గృహం శిథిలావస్థకు చేరింది. దీంతో స్థానికంగా ఓ పెద్ద రేకుల షెడ్డులోకి మార్చారు. ఆ షెడ్డుకు తలుపులు, కిటికీలు కూడా సరిగా లేవు. ఆవరణలో పిచ్చి చెట్లు ఏపుగా పెరిగాయి. ఇటీవల వర్షాలు జోరుగా కురుస్తుండటంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వసతిగృహానికి కనీసం దారి కూడా లేదు. దానికి సమీపంలోనే పందుల కొట్టం ఉండటంతో దుర్వాసన వస్తోందని, దీంతో భోజనం కూడా సంతృప్తిగా చేయలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతి గృహానికి నూతన భవనం నిర్మించాలని, అప్పటివరకు అన్ని వసతులున్న అద్దె భవనాన్ని అయినా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సదుపాయాలు కల్పిస్తాం
బీసీ వసతిగృహం రేకుల షెడ్డులో ఉన్నది వాస్తవమే. విద్యార్ధులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. హాస్టల్‌ను పరిశీలించి, సమస్యలను తెలుసుకుంటాను. మరీ ఇబ్బందిగా ఉంటే విద్యార్థులకు అనుకూలంగా ఉండే చోటుకు మారుస్తాం. కొత్త భవన నిర్మాణ ఆవశ్యకతను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- జమరుద్దీన్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి