గోపన్నపల్లి గోడు పట్టించుకోరా?
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:00 PM
ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగు దాటలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్నారు.
- వర్షం వస్తే రాకపోకలు బంద్
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్థులు
భూత్పూర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగు దాటలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్నారు. ఇవాళ.. రేపు.. వచ్చే ఏడాది చేస్తామంటూ అధికారులు కాలం గడుపుతున్నారే తప్ప ఇంత వరకూ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పోతులమడుగు గ్రామ పంచాయతీలోని గోపన్నపల్లి గ్రామానికి పోతులమడుగు గ్రామంలోని శివాలయం పక్కనుంచే వాగును దాటి వెళ్లాలి. అయితే వర్షాకాలంలో ఈ వాగు నిండుగా పారితే.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గత 20 ఏళ్లుగా గోపన్నపల్లి గ్రామస్థులు వర్షాకాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటూ.. వస్తున్నారు. అయితే ఎన్నికల ముందు రాజకీయ నాయకులు కాజ్‌వే నిర్మాణం చేపడతామని హామీ ఇస్తూ వస్తున్నారే తప్ప ఇప్పటికీ నిర్మించకపోవడంతో గోపన్నపల్లి గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో వాగుపై నిర్మించిన చిన్నపాటి రోడ్ డ్యాము భారీ నీటి ఉధృతికి తెగిపోయింది. అప్పట్లో జిల్లా స్థాయి అధికారులు వచ్చి వాగు పరిస్థితిని చూసి, వర్షాలు తగ్గిన వెంటనే బ్రిడ్జీ నిర్మిస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా ఇప్పటికీ హామీ నెరవేరలేదు. ఈనెల 13వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాల కూడా మూత పడగా, కళాశాలకు, ప్రైవేట్ బడులకు వెళ్లే విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగుపై వంతెనను నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.