Share News

ప్రైవేట్‌ టీచర్ల వెల్ఫేర్‌ ఫండ్‌కు రూ.పది లక్షలు విరాళం

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:01 PM

ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసుకోవాలని, అందుకు యాజమాన్యాలు, టీచర్లు కలసి ప్రతీ నెల రూ.500 జమ చేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రైవేట్‌ టీచర్ల వెల్ఫేర్‌ ఫండ్‌కు   రూ.పది లక్షలు విరాళం
ఉపాధ్యాయులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి

- గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసుకోవాలని, అందుకు యాజమాన్యాలు, టీచర్లు కలసి ప్రతీ నెల రూ.500 జమ చేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా ట్రస్మా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 300మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో 65శాతం మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, అందుకు ప్రైవేట్‌ విద్యా సంస్థలను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుల వెల్ఫేర్‌ ఫండ్‌కు తన వంతుగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఆరోగ్యభీమా కోసం ప్రతీ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు తమవంతుగా రూ.250 చెల్లించాలని, అదే విధంగా పాఠశాల యాజమాన్యం కూడా రూ.250 చెల్లిస్తాయని తెలిపారు. పదో తరగతిలో జిల్లాలో వందశాతం ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, రిషి విద్యాసంస్థల ముఖ్య సలహాదారు వెంకటయ్య, వాడ్దేవి కళాశాల కరస్పాండెంట్‌ విజేత వెంకట్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌, ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడులక్ష్మణ్‌, నాయకుడు క్రాంతికుమార్‌, పట్టణ అధ్యక్షుడు వంశీమోహన్‌రెడ్డి, రిషి విద్యాసంస్థల చైర్మన్‌ చంద్రకళావెంకటయ్య, లక్ష్మణ్‌గౌడ్‌, రమేష్‌ పాల్గొన్నారు.

పాలమూరు ట్రిపుల్‌ ఐటీ ప్రతిష్టను పెంచాలి

మీరంతా కష్టపడి చదివి పాలమూరు ట్రిపుల్‌ ఐటీ ప్రతిష్టను పెంచాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ట్రిపుల్‌ ఐటీ కళాశాలను ఆకస్మీకంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? హాస్టల్‌ భోజనం ఎలా ఉందని తెలుసుకున్నారు. విద్యార్థులు అన్ని వసతులు బాగున్నాయని సమాధానమిచ్చారు. ట్రిపుల్‌ ఐటీ ప్రిన్సిపాల్‌ శ్రవన్‌కుమార్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, నాయకులు రఘు, యాదిరెడ్డి, రెడ్డి సేవా సంఘం సభ్యులు సురేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:01 PM