Share News

సూసైడ్‌ నోట్‌ రాసి వైద్యుడి అదృశ్యం

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:45 PM

కంటి వైద్యుడు ఏకంగా 17 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యమైన ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్‌లో చోటు చేసుకుంది.

సూసైడ్‌ నోట్‌ రాసి వైద్యుడి అదృశ్యం
వైద్యుడు రమేశ్‌

మద్దూర్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కంటి వైద్యుడు ఏకంగా 17 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యమైన ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్‌ మండలం గోకఫస్లావాద్‌ గ్రామ పరిధిలోని గోడమర్రిగద్దతండాకు చెందిన రమేశ్‌ మద్దూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నేత్ర కంటి పరీక్ష ఆసుపత్రిని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పు విషయంలో తనకు ఇద్దరు వ్యక్తులతో తీవ్ర ఒత్తిడి ఉందని, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని నోట్‌ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఆదివారం ఉదయం నుంచి అదృశ్యమయ్యాడు. ఇది కాస్త వైరల్‌ కావడంతో తండ్రి దామ్లానాయక్‌ తన కుమారుడి అదృశ్యంపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రెండు టీంలు ద్వారా విచారణ ప్రారంభించారు. రమేశ్‌ తమ్ముడు వినోద్‌ సమక్షంలో మద్దూర్‌లోని కంటి ఆసుపత్రిలో విచారించారు. రమేశ్‌ ఫోన్‌, ఓ పత్రం లభించింది. దీని ఆధారంగా విచారణ చేయగా తాను తిరుపతికి వెళ్తానని చెప్పి అదే ఆసుపత్రిలో పని చేస్తున్న చిన్న స్వామి అనే వ్యక్తితో కలిసి ఉదయం 5గంటలకు నారాయణపేట బస్టాండ్‌లో ద్విచక్రవాహనం ద్వారా వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే దానిపై సీసీ ఫుటేజ్‌ ద్వారా పరిశీలిస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 28 , 2025 | 11:45 PM