రిజర్వేషన్‌లపై చర్చల జోరు
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:26 PM
గ్రామ పంచాయతీల్లో 14 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు త్వరలోనే తెరపడనున్నది.
- హైకోర్టు ఆదేశాలతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం
- ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశావాహుల ఎదురుచూపులు
- రంగం సిద్ధం చేసుకుంటున్న ప్రధాన పార్టీలు
- ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తి
అయిజ టౌన్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీల్లో 14 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు త్వరలోనే తెరపడనున్నది. గత నెల 25న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలల క్రితమే స్థానిక ఎన్నికలకు కావలసిన సామగ్రిని సమకూర్చడం, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడం, ఓటరు జాబితాలు ప్రకటించడం తదితర ఎన్నికల పనులను జిల్లా అధికారులు పూర్తి చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం, ఎన్నికల సంఘం ప్రకటనే తరువాయి అన్నట్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఈనెల 25వ తేదీనాటికి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసి, సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. దీంతో మరో 20 రోజుల్లో రిజర్వేషన్లు వెల్లడవుతాయని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..
మహబూబ్‌నగర్ జిల్లాలో 423 గ్రామ పంచాయతీలున్నాయి. జడ్‌పీటీసీ 16, ఎంపీటీసీ 175 స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. మిగతా 3 మునిసిపాలిటీల్లో 49 కౌన్సిలర్ స్థానాలున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామపంచాయితీలు ఉండగా, 141 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 13 మండలాలకు గానూ 13 జడ్‌పీటీసీ స్థానాలు ఉంటాయి. గద్వాల, అయిజ, వడ్డెపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 77 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 255 గ్రామపంచాయతీలున్నాయి. ఎంపీటీసీ స్థానాలు 128, జడ్‌పీటీసీ స్థానాలు 14 ఉన్నాయి. మునిసిపాలిటీలు 5 ఉండగా, మొత్తం వార్డులు 80 ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 274 గ్రామ పంచాయతీలున్నాయి. ఎంపీటీసీ 136 జడ్‌పీటీసీ 13 స్థానాలున్నాయి. మునిసిపాలిటీలు 4 ఉండగా, 72 కౌన్సిలర్ స్థానాలున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలున్నాయి. జడ్‌పీటీసీ 20, ఎంపీటీసీ 210 స్థానాలున్నాయి. 4 మునిసిపాలిటీలు 84 కౌన్సిలర్ స్థానాలున్నాయి. అయిదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 27 శాతం, ఎస్‌సీలకు 15 శాతం, మరో 6 శాతం ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. గత ఎన్నికలను కూడా ఇవే రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించారు.
42 శాతంపై ఉత్కంఠ !
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పుల మేరకు ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించలేదు. కానీ ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే, మిగతావి ఎలా ఉండబోతున్నాయో తేలాల్సి ఉంది. గతంలో ఇచ్చిన మొత్తం 48 శాతం రిజర్వేషన్లలో బీసీలకు 42 శాతం ఇస్తే, ఎస్సీ, ఎస్టీలకు తగ్గే అవకాశం ఉంది. ఒక వేళ ఆ రిజర్వేషన్లను అలాగే ఉంచి బీసీలకు 27 శాతానికి అదనంగా 15 శాతం పెంచితే రిజర్వేషన్లు 50 శాతం దాటే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.
సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ఆదేశాల నేపథ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో గత నెల 25వ తేదీన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ శాంతినగర్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్దమవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదే నెల 26న జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకుడు బాసు హనుమంతు నాయుడు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గద్వాల నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామాల్లో చర్చలు మొదలయ్యాయి.