Share News

పార్టీలైన్‌ దాటితే క్రమశిక్షణ చర్యలు

ABN , Publish Date - Nov 01 , 2025 | 10:56 PM

పార్టీ లైన్‌ దాటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ హెచ్చరించారు.

పార్టీలైన్‌ దాటితే క్రమశిక్షణ చర్యలు
మాట్లాడుతున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ

మహబూబ్‌నగర్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పార్టీ లైన్‌ దాటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ హెచ్చరించారు. పార్టీలో ఉంటూ పార్టీపైనా, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిపై బహిరంగ విమర్శలు చేస్తే ఊపేక్షించేది లేదని మాజీ కౌన్సిలర్‌ గంజి ఆంజనేయులును ఉద్దేశించి మాట్లాడారు. శనివారం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరావని, అప్పుడు కాంగ్రెస్‌ గుర్తు రాలేదా అని విమర్శించారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థితో సహా తామంతా మద్దతు కోసం వస్తే తన వల్లకాదని, తాను జడ్చర్లలో పనిచేసుకుంటానని వెళ్లిన వ్యక్తివి నీవని, ఎన్నికల అనంతరం పార్టీ నిన్ను హక్కున చేర్చుకుంటే పార్టీపైనా, ఎమ్మెల్యేపైనా విమర్శలు చేస్తావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రెండుసార్లు కౌన్సిలర్‌ టికెట్‌ ఇస్తే గెలిచావని, మూడోసారి టికెట్‌ ఇస్తే ఓడిపోయిన వెంటనే పార్టీని వీడి వెళ్లిపోయావన్నారు. మత్స్యశాఖ సహకారం ఇన్‌చార్జిగా ఇప్పటి వరకు మీరే ఉన్నారని, ఇప్పుడు పార్టీ కోసం కొట్లాడి కేసులను ఎదుర్కున్న వ్యక్తికి మత్య్సశాఖ పదవి ఇస్తే విమర్శలు చేస్తావా ఇదేనా పద్దతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమ శిక్షణ చర్యలు తప్పవని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మతిభ్రమించి అవాకులు చెవాకులు మాట్లాడితే సరికాదని, ఏదైనా ఇబ్బంది ఉండే పార్టీ నాయకులతో చర్చించాలే తప్పా బహిరంగంగా విమర్శలకు దిగితే చర్యలు తప్పవన్నారు. నాయకులు మైత్రి యాదయ్య, రామకృష్ణ, తిరుమల వెంకటేశ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 10:56 PM