Share News

డెడ్‌లైన్‌ సెప్టెంబరు 15

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:36 PM

ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే ఒత్తిడిలో బ్యాటరీలను మారుస్తుండగా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో మంటలు చెలరేగి తొమ్మిది మంది సజీవ దహనమైన దుర్ఘటనకు నేటికి ఐదేళ్లు పూర్తవుతోంది.

డెడ్‌లైన్‌ సెప్టెంబరు 15

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో నాలుగో యూనిట్‌ రన్‌ చేయడానికి ఏర్పాట్లు

పూర్తి కావొస్తున్న స్టార్టర్‌ వైండింగ్‌, 27న రోటర్‌ దించనున్న అధికారులు

అన్నీ అనుకున్నట్లు జరిగాక మరోసారి హై ఓల్టేజీ టెస్టు, తర్వాత ఉత్పత్తి

ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగి నేటికి ఐదేళ్లు

బాధిత కుటుంబాలకు పరిహారం, ఇంటికొకరు ఉద్యోగాల్లో నియామకం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే ఒత్తిడిలో బ్యాటరీలను మారుస్తుండగా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో మంటలు చెలరేగి తొమ్మిది మంది సజీవ దహనమైన దుర్ఘటనకు నేటికి ఐదేళ్లు పూర్తవుతోంది. 2020 ఆగస్టు 20వ తేదీన ఈ దుర్ఘటన జరగ్గా జెన్‌కో ఉద్యోగులు ఏడుగురు, ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగులు ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో నాలుగో యూనిట్‌ పూర్తిగా కాలిపోగా సుమారు రూ. 100 కోట్ల మేర ఆస్తినష్టం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదేళ్లుగా నాలుగో యూనిట్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జెన్‌కో కష్టపడుతున్నప్పటికీ ఇంకా పనులు పూర్తికాలేదు. ఈ ఏడాది విద్యుత్‌ ఉత్పత్తి సీజన్‌ కొనసాగుతుండగా సెప్టెంబరు 15 వరకు పనులు పూర్తిచేసి నాలుగో యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇప్పటికే స్టేటర్‌ వైండింగ్‌ పనులు పూర్తి కావొస్తుండగా బార్‌ గ్రేసింగ్‌, ఎండ్‌ క్యాప్స్‌ ఫిల్లింగ్‌ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. ఆగస్టు 27వ తేదీన స్టేటర్‌ పనులు పూర్తిచేసి రోటర్‌ను దించడానికి నిర్ణయించారు. ఆ తర్వాత అప్పర్‌ బ్రాకెట్స్‌, ప్లేట్స్‌ బిగించి మరోసారి హెచ్‌వీ (హై ఓల్టేజీ) టెస్టును పూర్తిచేయనున్నారు. ఆ తర్వాత విద్యుదుత్పత్తికి మార్గం క్లియర్‌ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. జూలై 14వ తేదీ నాటికే నాలుగో యూనిట్‌లో మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని భావించినప్పటకీ సాధ్యంకాలేదు. ఇప్పుడు తాజా గడువులోపు పనులు పూర్తవుతాయా అనేది తెలియాల్సి ఉంది. జెన్‌కో, కాంట్రాక్టు సంస్థ అయిన వాయిత్‌ ఏజెన్సీలకు చెందిన 25 మంది ఉద్యోగులు నిరంతరం పనులు చేస్తున్నారు. ఈ యూనిట్‌ ప్రారంభమైతే మరో 150 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అదనంగా జరగనుంది.

దుర్ఘటన తీరు ఇది

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం పూర్తి అండర్‌గ్రౌండ్‌లో ఉంటుంది. జపాన్‌ సాంకేతికతతో నిర్మించిన ఈ హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో 150 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఇందులో ఉత్పత్తి ప్రారంభించిన 20 సంవత్సరాలపాటు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తలేదు. 2020 ఆగస్టు 20వ తేదీన విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే క్రమంలో బ్యాటరీలపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో నాలుగో యూనిట్‌లో బ్యాటరీలు మారుస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యింది. ఉవ్వెత్తున ఎగిసి పడిన మంటల్లో నాలుగో యూనిట్‌ పూర్తిగా కాలిపోగా ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు ప్లాంట్‌ అసిస్టెంట్లు, ఇద్దరు అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. ప్లాంటును రక్షించాలని కష్టపడుతుండగా మంటలకు ఆహుతయ్యారు. ఈ దుర్ఘటనకు ఇద్దరు సీఈలను బాధ్యులుగా చేసి, వారి నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో గుర్తించిన తర్వాత వారిని ఎస్‌ఈ లుగా డిమోట్‌ చేశారు. అయితే తర్వాత వారు మళ్లీ అడ్డదారుల్లో ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 9 మంది మృతికి కారణమైన వారిని నామమాత్రపు చర్యలతో వదిలేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున జెన్‌కో పరిహారం అందించగా వారందరి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి చొప్పున ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఈ దుర్గటనలో దాదాపు రూ. 100 కోట్ల మేర ఆస్తినష్టం జరిగింది.

ఆది నుంచీ అవాంతరాలే...

ప్రమాదం జరిగిన తర్వాత నాలుగో యూనిట్‌ పునరుద్ధరణ కోసం ఢిల్లీకి చెందిన వాయిత్‌ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. 2021 సెప్టెంబరులో పనులు ప్రారంభించగా 2023 జూలై చివరి నాటికి పూర్తిచేసి జెన్‌కోకు అప్పగించారు. 2023 జూలై 17న నాలుగో యూనిట్‌ను రన్‌ చేసి, గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 19 రోజుల్లో 70 గంటల వ్యవధిలో 11.60 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. 2023 ఆగస్టు 17న స్టార్టర్‌ వైండింగ్‌ బార్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మరోసారి మంటలు చెలరేగాయి. యూనిట్‌ కాలిపోయి అప్పటి నుంచి పనిచేయడం లేదు. కాంట్రాక్టు కంపెనీ జెన్‌కో సంస్థ సక్రమంగా రన్‌ చేయకపోవడంతోనే మంటలు చెలరేగాయని తప్పించుకునే ప్రయత్నం చేయగా జెన్‌కో నిపుణుల కమిటీతో విచారణ చేయించింది. ఇందులో మరమ్మతుల్లో నాసిరకం మెటీరియల్‌ వాడటం వల్లే ప్రమాదం జరిగిందని తేలింది. దీంతో వాయిత్‌ కంపెనీ లైసెన్సును బ్లాక్‌ లిస్టులో పెట్టారు. తర్వాత మళ్లీ అదే కంపెనీకి పనులు అప్పగించింది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. స్టార్టర్‌ వైండింగ్‌ బార్లు 950 వరకు ఉండగా అందులో 150 కాలిపోగా వాటిని తొలగించింది కొత్తవి చైనా నుంచి తెప్పించి ప్రస్తుతం బార్‌ గ్రీసింగ్‌ చేస్తున్నారు. అయితే ఈసారి యూనిట్‌లోని స్టార్టర్‌ బార్లు, రోటర్‌లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ముందే పసిగట్టేందుకు ప్రత్యేకమైన సెన్సార్లను బిగిస్తున్నారు. దీనివల్ల పనితీరును ప్యానెల్‌ మానిటర్‌లో గమనించి ప్రమాదం జరుగకుండా చూసుకునే వెసులుబాటు కలుగుతుందని ఇంజనీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:36 PM