పంథా మార్చిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Mar 16 , 2025 | 10:44 PM
సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చారు. హిందీలో లాటరీ తగిలిందని, లోన్ మంజూరైందని చెప్పి గతంలో కాల్ చేసే ముఠాలు అలాంటి కాల్ మోసాలపై అవగాహన పెరగడంతో మోసాలకు పాల్పడటం కష్టంగా మారింది.

స్థానికుల సాయంతో ఆన్‌లైన్ మోసాలు
నిరుద్యోగులను నియమించుకొని చేసుకుని జామ్‌తారా, పాట్నాలో శిక్షణ
జాబితా ఇచ్చి.. వచ్చిన సొమ్ములో భాగాలు
ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే 150 మంది నిందితుల గుర్తింపు
నెల రోజుల వ్యవధిలో 32 మందిని అరెస్టు చేసిన వనపర్తి జిల్లా పోలీసులు
స్థానిక లొకేషన్స్ నుంచి మోసాలు చేయడం ద్వారా గుర్తించిన సైబర్ క్రైం
రూ. 4 కోట్లు కాజేసినట్లు అంచనా
అన్ని జిల్లాల్లో స్లీపర్ సెల్స్
మహబూబ్‌నగర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చారు. హిందీలో లాటరీ తగిలిందని, లోన్ మంజూరైందని చెప్పి గతంలో కాల్ చేసే ముఠాలు అలాంటి కాల్ మోసాలపై అవగాహన పెరగడంతో మోసాలకు పాల్పడటం కష్టంగా మారింది. దీంతో స్థానికంగా నిరుద్యోగులుగా ఉండి ఎక్కువగా చదువుకోని యువకులను టార్గెట్ చేసుకొని లోకల్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. బిహార్‌లోని పాట్నా, జామ్‌తారా, కోల్‌కత్తలోని పలు కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి తర్వాత వారిని మోసాల్లో భాగస్వాములుగా చేస్తున్నారు. వచ్చిన సొమ్మును మూడు భాగాలుగా విభజించి ఇస్తుండటంతో రాష్ట్రంలోని యువత కూడా సులభంగా జల్సాలకు అలవాటుపడుతోంది. దాదాపు నాలుగేళ్లుగా ఈ రిక్రూట్‌మెంట్, మోసాలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలంలోని నక్కలబండ తండా, వాల్యతండా, గత సంవత్సరం పూజారి తండాలో ఇలా ఆ గోదాలోకి దిగి తప్పించుకునే ప్రయత్నంలో ముగ్గురు యువకులు కూడా చనిపోయారు. నాలుగేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా తండాలు, చిన్న గ్రామాలు, నిరుపేద యువకుల కేంద్రంగా ఈ తరహా నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలో బీహార్ ముఠాలు చేస్తున్న సైబర్ నేరాల్లో భాగస్వాములుగా ఉన్న దాదాపు 150 మందిని గుర్తించగా నెలరోజుల వ్యవధిలో వనపర్తి జిల్లా పోలీసులు 32 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షిఖా గోయల్ ఆధ్వర్యంలో నిందితులను గుర్తించి అరెస్టులు కొనసాగుతున్నాయి. నిందితుల్లో ఎక్కువ మంది నిరుపేదలు కావడం గమనార్హం. సైబర్ నేరాల్లో భాగస్వాములు అయిన తర్వాత వారి లైఫ్ స్టైల్ మారడం, ఇళ్లు నిర్మించుకోవడం, కార్లు కొనుగోలు చేయడం, డబ్బులు విరివిగా ఖర్చు చేస్తుండటంతో మిగతా యువకులు, పరిచయస్తులు కూడా వారు చేసే పనుల పట్ల ఆకర్షితులవుతున్నారు. బిహార్ ముఠాలు కూడా ఏ ప్రాంతం వారిని మోసం చేయడానికి ఆ ప్రాంతం యువతనే రిక్రూట్ చేసుకుంటున్నారు.
స్థానిక లొకేషన్స్ ఆధారంగా గుర్తింపు...
లోకల్ రిక్రూట్‌మెంట్స్ దాదాపు కరోనా కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని గుర్తించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మూసాపేట మండలం సూర్తి తండా, చక్రాపూర్, కనకాపూర్ తండా నుంచి ఈ రిక్రూట్‌మెంట్ ఆజ్యం పోసుకుందని సమాచారం. ఒక్కొక్కరుగా ఇప్పుడు వందల సంఖ్యలో యువకులు నేరాల్లో భాగస్వాములుగా మారారు. స్థానిక యువకులను మొదట బిహార్‌కు తీసుకెళ్లి అక్కడ శిక్షణ ఇస్తారు. ఆ సమయంలోనే గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అలవాటు చేస్తారు. ఇది తప్పని భావించిన వారిని తప్పించుకోకుండా చూసుకుంటారు. ఎదురు తిరిగితే చంపడానికి కూడా వెనుకాడరు. ఈ క్రమంలో మోసం చేయడం ద్వారా వచ్చిన సొమ్మును మెయిన్ హెడ్‌కు 50 శాతం, మిడిల్ మెన్‌కు 25 శాతం, ఎవరైతే ఆ మోసానికి పాల్పడ్డారో వారికి 25 శాతం చొప్పున పంచుకుంటారు. నాలుగేళ్లుగా ఈ రిక్రూట్‌మెంట్ కొనసాగుతున్నప్పటికీ బీహార్ జామ్‌తారాలో చాలా రోజుల నుంచి ఈ తరహా మోసాలు జరగడం పరిపాటి. అక్కడకు వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పోలీసులు కూడా జంకుతారు. గతంలో ముగ్గురు యువకులు ఈ మోసాలకు ఎదురుతిరిగి చనిపోయినప్పుడు కూడా అక్కడికి వెళ్లి విచారణ చేయలేకపోయారు. అయితే ఈ కేసుల్లో మొదట కరీంనగర్ నుంచి ఒక మోసాన్ని గుర్తించగా నిందితుడు వాడిన ఫోన్ లొకేషన్ వనపర్తి అని చూపించింది. వారు ఇక్కడకు సమాచారం ఇచ్చినప్పటికీ అటవీ ప్రాంతాల్లో, కలెక్టరేట్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతాల్లో లొకేషన్ చూపించింది. అ సమయంలో అదే తరహా మోసం వనపర్తి జిల్లా కొత్తకోటలో నమోదైంది. మోసానికి వాడటానికి ఉపయోగించిన ఫోన్‌కు నిందితుడి పర్సనల్ ఫోన్ ద్వారా నెట్ కనెక్టివిటీ చేసుకున్నారు. దీంతో కేసును ట్రేస్ చేయగా పెద్దమందడి మండలంలోని తండావాసులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పటివరకు అదే తరహా మోసాల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో 32 మందిని నెలరోజుల వ్యవధిలో అరెస్టు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ రిక్రూట్‌మెంట్ ఉన్నదని, తమిళనాడు, కేరళ లలో కూడా ఈ ముఠా రిక్రూట్‌మెంట్లు కొనసాగిస్తోందనే సమాచారం ఉన్నదని వనపర్తి సైబర్ క్రైం డీఎస్పీ ఎన్‌బీ రత్నం తెలిపారు.
మోసాలు ఇలా చేస్తారు...
మొదట చాలామంది హిందీలో ఫోన్‌కాల్స్ చేసి సైబర్ నేరాలకు పాల్పడేవారు. ఇలాంటి నేరాలపై ఒక సిరీస్ కూడా జామ్‌తారా పేరుతో ఉన్నది. ఆ తర్వాత ఫోన్ ఎత్తి హిందీలో సంభాషణ వినిపించగానే అవగాహన పెరిగిన ప్రజలు కట్ చేస్తున్నారు. వీటితో పాటు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు అడిగేవారు కూడా ఉన్నారు. హిందీలో మాట్లాడి మోసాలకు పాల్పడటం కష్టం కావడంతో ప్రాంతాల వారీగా లోకల్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నారు. ముద్ర లోన్లు, ధని యాప్ ద్వారా లోన్లు ఇస్తామని ముందుగా నమ్మిస్తారు. మాట్లాడే వారు చుట్టుపక్కల యాసతోనే మాట్లాడుతుండటంతో బాధితులు కూడా మోసపోతున్నారు. తర్వాత యాప్ లింక్ ఇచ్చి వివరాలు తీసుకుంటారు. ఒక ఫేక్ లెటర్ హెడ్ ప్రధానమంత్రి ఫొటోతో ఉన్నది క్రియేట్ చేసి లోన్ మంజూరైందని పంపిస్తారు. తిరిగి చెల్లించాల్సిన వాయిదాల షెడ్యూల్ కూడా నెలనెలా ఎంత చెల్లించాలో పంపిస్తారు. దీంతో వాటిని నమ్మిన తర్వాత ఒకవేళ లోన్ తీసుకున్న తర్వాత వ్యక్తి మరణిస్తే కుటుంబంపై భారం పడకుండా లోన్‌పై ఇన్సూరెన్స్ చేస్తామని, లోన్ ప్రాసెసింగ్ రుసుం, టీడీఎస్, జీఎస్టీ పేరుతో అమౌంట్ చెల్లించాలని కోరుతారు. బాధితుడు చెల్లించడానికి సిద్ధమైన తర్వాత బిహార్‌లోని మెయిన్ పార్టీకి చెప్పి అకౌంట్ నెంబర్లు, క్యూఆర్ కోడ్ ద్వారా వాటిని చెల్లిస్తారు. ఆ మొత్తం నుంచి స్థానికంగా మోసానికి పాల్పడిన వ్యక్తికి 25 శాతం సొమ్మును చెల్లిస్తారు. అయితే ఈ కేసుల్లో పట్టుబడుతున్న వారు స్థానిక లొకేషన్స్‌లో ఉండి ఆపరేట్ చేయడం లేదా మెయిన్ పార్టీ అకౌంట్ నెంబర్ కాకుండా సొంత అకౌంట్ నెంబర్లు ఇవ్వడంతో పోలీసులు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.నాలుగు కోట్లు ఈ లోకల్ రిక్రూట్‌మెంట్ ద్వారా కాజేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇంకా తవ్వేకొద్ది అక్రమాల చిట్టా వెలుగులోకి వస్తూనే ఉన్నది. ముఖ్యంగా ఈ మోసాలకు రిక్రూట్ అవుతున్న ప్రాంతాల్లో పోలీసులు ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫేస్‌బుక్‌లో చూసి..
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన తోగుట రాజు గత డిసెంబరు 17న ఫేస్‌బుక్ చూస్తుండగా ధని ఫైనాన్స్ లోన్ యాప్ ప్రకటన పేజీని టచ్ చేశారు. తర్వాత తెలియని వ్యక్తి ఫోన్ చేసి లోన్ కావాలా అని అడగ్గా రూ. 3 లక్షలు కావాలని చెప్పాడు. ప్రతీనెల రూ. 8860 చొప్పున చెల్లించాలని చెప్పి ఇన్సూరెన్స్ కోసం డబ్బులు అడిగారు. క్యూఆర్ కోడ్ పంపియ్యగా ఒకసారి రూ. 6850, మరోసారి రూ. 8860 ఫోన్‌పే ద్వారా పంపించాడు. అయినా డబ్బులు జమ కాకపోగా. మరుసటి రోజు మరింత మొత్తం చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చి వనపర్తిటౌన్ పీఎస్‌లో రిపోర్ట్ చేశాడు. ఈ కేసుపై విచారణ చేసిన పోలీసులు మొత్తం ఏడుగురు నిందితులను జనవరి 5న అరెస్టు చేశారు. సోడే కృష్ణకుమార్, కొత్త ఆంజనేయులు, జనుంపల్లి నితీష్‌కుమార్‌రెడ్డి, ఆగుపోగు మహేష్, సోడే భాను, దోసల నవీన్‌కుమార్‌రెడ్డి, మోరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డిని విచారించగా కోల్‌కతా, ఢిల్లీకి చెందిన అంకిత్, రాహుల్, పంకజ్‌ల శిక్షణలో ఈ మోసాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ముద్రా, ధని లోన్ యాప్‌ల ద్వారా సేకరించిన కస్టమర్ల వివరాలను ఎక్సెల్ ఫైల్ తీసుకొని వారు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి మోసాలకు పాల్పడిన తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసేవారమని ఒప్పుకున్నారు.
తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడంతో..
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం పొలికెపాడుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి ఒక తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ధని యాప్ ద్వారా లోన్‌కు అర్హత పొందారు. అవసరం ఉన్నదా అని అడగ్గా. తనకు అవసరం ఉన్నదని చెప్పి వివరాలు ఇచ్చారు. లోన్ డబ్బులు మీ అకౌంట్‌లో జమ కావాలంటే ఇన్సూరెన్స్, టీడీఎస్, ప్రాసెసింగ్ చార్జీలు, జీఎస్టీ ముందుగానే చెల్లించాలని చెప్పడంతో నిజమేనని చెప్పి తన బ్యాంకు అకౌంట్ పనిచేయకపోవడంతో తన బావ అయిన శివను లోన్ మంజూరైంది. కొన్ని డబ్బులు కట్టాలి. వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తానని చెప్పారు. బావ అకౌంట్ నుంచి 2024 నవంబరు 29న విడతల వారీగా తెలియని వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్లకు రూ. 32,135 పంపించారు. ఇంకా డబ్బులు పంపమని అడుగుతుండటంతో అనుమానం వచ్చి సైబర్ పోర్టల్ 1930కి ఫోన్ చేసి రిపోర్టు చేశారు. గోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. అప్పటికే ఇలాంటి కేసుల దర్యాప్తులో ఉన్న పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం సూర్తి తండాలో నరేష్ నాయక్, వెంకటేష్ నాయక్, చందు నాయక్‌ను అరెస్టు చేశారు. తర్వాత అదే తండా చెందిన తాజా కేసు నిందితుడు కట్రావత్ వెంకటే్‌షను అదుపులోకి తీసుకున్నారు. తమ తండాలకు చెందిన చాలా మందిమి బృందంగా ఏర్పడి మోసాలు చేస్తున్నట్లు, బిహార్, కోల్‌కతా, ఢిల్లీకి చెందిన పంకజ్ కుమార్, సునీల్‌కుమార్, షంబూ, కార్తీక్, వివేక్, కుషవాహల ఆదేశాలు, శిక్షణతో ఈ నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు.
ఈజీ మనీకి అలవాటు పడటంతోనే మోసాలు
బిహార్, కోల్‌కతాలకు చెందిన ముఠాలు స్థానికంగా ఎక్కువగా చదువుకోని యువతను ఈ సైబర్ మోసాల్లో భాగస్వాములను చేస్తున్నాయి. ఒకరు వెళ్లి కొన్ని డబ్బులు సంపాదించిన తర్వాత మిగతా వారిని కూడా వారి దగ్గరి బంధువులే ఇందులోకి లాగి డబ్బులు వస్తాయని ఆశ చూపుతున్నారు. అన్నీ ఎలక్ర్టానిక్ డాక్యుమెంట్స్ కాబట్టి రికార్డు అవుతాయి. జైలు శిక్ష కూడా తప్పదు. ఈ యువకులకు అది అర్థం కావడం లేదు. అలాగే ఈ నేరాల వల్ల వచ్చిన సంపాదన కూడా వారి వద్ద ఉండదు. సమాజంలో దొంగలుగా ముద్ర వేసుకోవాల్సి ఉంటుంది. వారి కుటుంబాలు కూడా తలెత్తుకొని తిరగలేవు. కాబట్టి ఈజీ మనీకి యువత అలవాటు పడొద్దు.
- రావుల గిరిధర్, ఎస్పీ వనపర్తి