Share News

నీళ్లు ఇవ్వలేక క్రాప్‌ హాలిడే

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:15 PM

రైతులకు సాగునీరు అందించడం చేతకాక ప్రభుత్వం క్రాప్‌ హాలిడే ప్రకటించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

నీళ్లు ఇవ్వలేక క్రాప్‌ హాలిడే
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

- గ్రామ పంచాయతీల్లోఎగిరిన గులాబీ జెండా

- రైతులు కష్టపడుతుంటే జిల్లా మంత్రి విహారయాత్ర

- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రైతులకు సాగునీరు అందించడం చేతకాక ప్రభుత్వం క్రాప్‌ హాలిడే ప్రకటించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి శుక్రవారం వనపర్తి పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అనంతరం రాజాపేట శివారులోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పాలమూరు నదీ జలాల హక్కుల సాధన’ సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. నీళ్లు లేక రైతులు కష్టపడుతుంటే జిల్లా మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సోమశిలలో విహార యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. అధికార పార్టీ అహం, మద్యం, డబ్బులకు పోటీగా నిలబడి కుంభస్థలం లాంటి పెద్ద గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాను ఎగురవేశామన్నారు. సోలీపూర్‌, సవాయిగూడెంలో ముందుగా బీఆర్‌ఎస్‌ మద్ధతుదారులు గెలిచారని అధికారులు ప్రకటించారన్నారు. కానీ తరువాత కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన వారు గెలిచినట్లు చెప్పారని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. నూతన సర్పంచులు ప్రతీ అంశంపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. దేశంలో అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామాలకు నూతన సర్పంచులు వెళ్లి రావాలన్నారు. అందుకు తానే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. గడిచిన రెండేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మన్ను కూడా తీయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసినా, మిగిలిన పనులను కూడా చేయట్లేదన్నారు. వచ్చే నెలలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజె క్టు వద్ద కేసీఆర్‌ సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఖర్చు, పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం ఇతరులను విమర్శించడమేనన్నారు. జనాలకు మంచి జరిగేలా నూతన సర్పంచులు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు నాగం తిరుపతిరెడ్డి, గట్టు యాదవ్‌, రమేశ్‌ గౌడ్‌, కృష్ణ నాయక్‌, లక్ష్మారెడ్డి, మాణిక్యం, విజయ్‌, కురుమూర్తి యాదవ్‌, చిట్యాల రాము పాల్గొన్నారు

Updated Date - Dec 26 , 2025 | 11:15 PM