Share News

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు

ABN , Publish Date - May 10 , 2025 | 11:05 PM

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జిల్లా కార్యదర్శి బి.బాలకిషన్‌ తెలిపారు.

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు

పాలమూరు, మే 10 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జిల్లా కార్యదర్శి బి.బాలకిషన్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట సమ్మె పోస్టర్‌ను విడుదల చేసి, మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సమ్మెలో సీపీఐ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలకు ఆజ్యం పోస్తూ కార్మిక, కర్షక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశం అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందన్నారు. సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ సురేష్‌, దేవదానం, గోపాల్‌, కామేశ్వరరావు, ఆంజనేయులు, యాదయ్య, శ్రీనివాస్‌, నరేష్‌, యాదగిరి, రమేష్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

నాలుగు లేబర్‌కోడ్‌లను ఉపసంహరించాలి

జడ్చర్ల : కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి, జిల్లా సహయకార్యదర్శి తెలుగు సత్తయ్య డిమాండ్‌ చేశారు. జడ్చర్ల పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈనెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె పోస్టర్‌ను విడుదల చేసి, మాట్లాడారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌, మహేష్‌, అలివేలు, దేవ్మ, కృష్ణ, శివలీల, యాదమ్మ, శంకర్‌, నరసింహ, విద్యాసాగర్‌, పాండు, కురుమూర్తి, యాదయ్య, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:05 PM