మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు వినూత్న తీర్పు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:05 PM
మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుపడ్డ వ్యక్తికి మహబూబ్‌నగర్ జిల్లా న్యాయాధికారి మంగళవారం వినూత్న తీర్పును ఇచ్చారు. డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని ప్లకార్డులు పట్టుకుని వాహనదారులకు కూడళ్లలో అవగాహన కల్పించాలని చెప్పారు.
కూడళ్లలో ప్లకార్డులతో అవగాహన కల్పించాలని ఆదేశం
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుపడ్డ వ్యక్తికి మహబూబ్‌నగర్ జిల్లా న్యాయాధికారి మంగళవారం వినూత్న తీర్పును ఇచ్చారు. డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని ప్లకార్డులు పట్టుకుని వాహనదారులకు కూడళ్లలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ తీర్పు అమలు బాధ్యతను ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. గత ఆగస్టు 24న నగరంలోని బోయపల్లి రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా, మోతీనగర్‌కు చెందిన రాఘవేందర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుపడ్డాడు. మంగళవారం అతన్ని రెండో తరగతి కోర్టులో న్యాయాధికారి నిర్మల ముందు హాజరుపరిచారు. న్యాయాధికారి నిందితుడికి రూ.2 వేల జరిమానాతో పాటు ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు పట్టుకొని వాహనదారులకు మద్యం తాగి వాహనాలు నడుపొద్దని రెండు రోజుల పాటు అవగాహన కల్పించాలని తీర్పు ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే తీర్పును అమలు పరుస్తూ మంగళవారం మొదటి రోజు రాఘవేందర్‌తో పలు కూడళ్లలో ప్లకార్డులు పట్టించి, వాహనదారులకు అవగాహన కల్పించారు.