పత్తి రైతుల పరేషాన్
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:38 PM
అధిక వర్షపాతం పంటను ఎదగనీయలేదు.. పూత నిలువక.. కాత కాయకపోవడంతో దిగుబడి తక్కువ వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.. ఇదే తరుణంలో తుఫాను ప్రభావం, కూలీల కొరతతో వర్షాలకు చేలల్లో ఉన్న పత్తి అలాగే కారిపోయి, కింద పడింది. మొక్కపై ఉన్న కాయలు మురిగిపోయాయి.
కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ కాకపోవడంతో అవస్థలు
పారదర్శకత కోసం తెచ్చిన యాప్‌తో పత్తి రైతుల అష్టకష్టాలు
అవగాహన లేకపోవడం. డేటా సరిపోలక పోవడమే సమస్య
ఈ ఏడు రైతులను ముంచిన అధిక వర్షపాతం
సీసీఐ కొనుగోళ్ల చిక్కులతో తక్కువ ధర ఇస్తున్న ప్రైవేటు వ్యాపారులు
మహబూబ్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధిక వర్షపాతం పంటను ఎదగనీయలేదు.. పూత నిలువక.. కాత కాయకపోవడంతో దిగుబడి తక్కువ వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.. ఇదే తరుణంలో తుఫాను ప్రభావం, కూలీల కొరతతో వర్షాలకు చేలల్లో ఉన్న పత్తి అలాగే కారిపోయి, కింద పడింది. మొక్కపై ఉన్న కాయలు మురిగిపోయాయి. పత్తి ఇక దిగుబడి వచ్చే అవకాశం లేక, ఇప్పటికే చాలామంది రైతులు మొక్కలను తొలగించారు. ఇన్ని కష్టాలు ఓవైపు వెంటాడుతుండగానే సీసీఐ రూపంలో పత్తి రైతు నడ్డి విరిచినట్లుగా పరిస్థితి తయారైంది. ప్రభుత్వ వ్యవస్థలు ఏటా పారదర్శకత పేరుతో ఏదో ఒక కొత్త ప్రయోగం చేయడం.. దానివల్ల రైతు నష్టపోయి, దళారులు లాభపడటం సర్వసాధారణంగా మారింది. ఈ ఏడాది కూడా పత్తి రైతుల విషయంలో అదే జరుగుతోంది. గత సంవత్సరం వ్యాపారులు రైతుల పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు తీసుకుని వారి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి.. సీసీఐకి మద్దతు ధరకు విక్రయించి అవకతవకలకు పాల్పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. సీసీఐ, మార్కెటింగ్ శాఖల్లో జరిగిన ఈ అవినీతిపై విజిలెన్స్ విచారణ కూడా చేసి నిర్ధారించుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లలో అవకతవకలను నివారించడం, పారదర్శకత కోసం ‘కపాస్ కిసాన్’ యాప్‌ను తెచ్చింది. అధికారులు, మిల్లర్లకు సంబంధం లేకుండా రైతులే నేరుగా సదరు యాప్‌లో పత్తి విక్రయం కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నల్లగా మారి, మొదటి దశలో వచ్చిన పత్తిని రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే రైతులు దళారులకు విక్రయించి.. నష్టపోయారు. తర్వాత వచ్చిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర రూ.8,110కి అమ్మేందుకు ఎదురుచూశారు. సాధారణంగా అక్టోబరు మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభం కావడానికి సెప్టెంబరులో టెండర్లు పూర్తవ్వాలి. కానీ ఈ యాప్ కారణంగానే టెండర్లు ఆలస్యంగా అయ్యి.. అక్టోబరు చివరివారంలో ప్రారంభమయ్యాయి.
అవగాహన లేకపోవడంతోనే..
ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నప్పుడు అది రైతులకు అర్థమవుతుందా? వారికి దానిపై అవగాహన ఉందా? లేదా అని తెలుసుకోవడం, వ్యవసాయ లేదా మార్కెటింగ్ అధికారులతో అవగాహన కల్పించడం వల్ల ఉపయుక్తంగా ఉంటుంది. కానీ కపాస్ కిసాన్ యాప్‌లో రైతులే నేరుగా స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పిన అధికారులు దానిపై అవగాహన కల్పించడం మాత్రం మరిచిపోయారు. దీంతో చాలామంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోలేక.. ఎవరు కలిస్తే వారిని బతిమాలుతున్న పరిస్థితులు సీసీఐ కేంద్రాల వద్ద కనిపిస్తున్నాయి. అందులో ఏదైన సమస్య వస్తే అదేంటో తెలుసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలు, తుఫాన్ ప్రభావంతో తేమశాతం సాధారణంగానే అధికంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులను పరిశీలనలోకి తీసుకుని సడలింపు ఇవ్వాల్సిన ప్రభుత్వం మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రజాప్రతినిధులు ఏదో తూతూ మంత్రంగా చెబుతున్నారే తప్ప.. తేమ 12 శాతం ఉంటేనే అన్‌లోడ్ చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభం కాగా.. ఇప్పుడు సెలవులతో రైతులు విక్రయించలేని పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు ఇదే అదునుగా భావించి రూ. 5 వేల నుంచి రూ. 6 వేల లోపు మాత్రమే ధర పెడుతున్నారు.
సమాచారం సరిపోలక..
కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే రైతులు తమ పంట వివరాలను, ఆధార్ నంబరును అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే సీజన్ ప్రారంభ సమయంలో రైతులు ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు అనే వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తారు. ఆ డేటాను ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇప్పుడు కిసాన్ కపాస్ యాప్‌కు కూడా ఇదే డేటా ప్రామాణికం. కానీ వ్యవసాయ అధికారులు సరిగా పంటల నమోదు కార్యక్రమం చేపట్టకపోవడం, పంటలు సాగు చేసినా చేయనట్లుగా నమోదు చేశారు. దాంతో ఇప్పుడు కపాస్ కిసాన్ యాప్‌లో రైతు నంబర్ ఇచ్చి.. ఓటీపీ ఎంటర్ చేశాక, ఫార్మర్ నాట్ రిజిష్టర్డ్ అని.. ఫార్మర్ ఆల్‌రెడీ రిజిష్టర్డ్ విత్ బార్‌కోడ్ అని వస్తోంది. స్లాట్ బుక్ కావడం లేదు. పూర్తిగా యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడంతో సీసీఐ అధికారుల వద్దకు వెళ్తే.. వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లాలని చెబుతున్నారు. వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తే సీసీఐ అధికారుల వద్దకు వెళ్లాలని తిప్పి పంపుతున్నారు. తిరిగే ఓపిక లేనివారు ఎంతోకొంతకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతుండగా.. మరికొందరు రైతులు తెలిసిన వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు ఉపయోగం లేకపోగా.. కష్టాలు తీవ్రమవుతున్నాయి. సీసీఐ నేరుగా కొనుగోలు చేసినప్పుడు కంటే ఇప్పుడే చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతునన్నారు.