వివాదాస్పదంగా విగ్రహావిష్కరణ
ABN , Publish Date - May 31 , 2025 | 11:06 PM
మాజీ పార్లమెంట్ సభ్యుడు, సినీ హీరో దివంగత ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ వివాదాస్పదమవుతోంది.
- అనుమతి లేదని కమిషనర్ నోటీసులు
- తెల్లవారుజామున ముసుగు తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు
మహబూబ్‌నగర్, మే 31 (ఆంధ్రజ్యోతి) : మాజీ పార్లమెంట్ సభ్యుడు, సినీ హీరో దివంగత ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ వివాదాస్పదమవుతోంది. విగ్రహాన్ని ఆవిష్కరించవద్దని కొన్ని గంటల ముందు కార్పొరేషన్ కమిషనర్ పేరిట కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడికి నోటీసులు జారీ చేయడం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా, పాలమూరులో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కృష్ణ విగ్రహం ముసుగు తొలగించడం చర్చనీయాంశమైంది. కృష్ణ, మహేశ్‌బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో పాలమూరులో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయమై సీఎం రేవంత్, స్థానిక ఎమ్మెల్యేను కలిసి విజ్ఞప్తి చేశారు. పాత డీఈవో కార్యాలయం చౌరస్తాలో విగ్రహం ఏర్పాటుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా స్వచ్ఛంద సంస్థతోపాటు ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు అభిమానులు దిమ్మెను నిర్మించి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచారు. శనివారం కృష్ణ జయంతి కి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉండగా, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు సినీహీరో సుధీర్‌బాబు, కృష్ణ మనవడు గల్లా అశోక్‌బాబును ఆహ్వానించారు. సరిగ్గా ఒక్క రోజు ముందు నేను సైతం సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్‌కుమార్ కోర్టును ఆశ్రయించడంతో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి విగ్రహావిష్కరణ చేయవద్దని నోటీసులు జారీ చేశారు. అయితే శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ముసుగును తొలగించడం చర్చకు దారి తీసింది. కృష్ణ జయంతిని పురస్కరించుకుని మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్‌రాజు ఆధ్వర్యంలో అభిమానులతో కలిసి ఆయన విగ్రహానికి గజమాల వేసి నివాళి అర్పించారు. కాగా దీనిపై సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్‌కుమార్ స్పందిస్తూ తమ న్యాయపోరాటం ఫలించిందని, తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినా కోర్టు దిక్కరణకు పాల్పడుతూ విగ్రహాన్ని ఆవిష్కరించారని, విగ్రహాన్ని తొలగించే వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. కృష్ణ అభిమానులు మాత్రం తమకు నోటీసులు అందలేదని వాట్సప్‌లలోనే చూశామని చెప్పుకొచ్చారు.