ని‘బంధనాలు’
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:01 PM
కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్లు అధికారంలో లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల్లో నియామకాలు ఆయా ప్రాంతాల సీనియర్ లీడర్ల కనుసన్నల్లోనే జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రె్‌సలోకి ఇతర పార్టీల నుంచి భారీ గా వలసలు వచ్చా రు.
డీసీసీ అధ్యక్ష పదవులకు పెట్టుకున్న పారామీటర్స్‌తో తంటాలు
అన్నీ పరిగణనలోకి తీసుకుంటే సమర్థులను ఎంపిక చేయలేని పరిస్థితి
పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలవైపు మొగ్గు చూపుతున్న అధిష్ఠానం
జూబ్లీహిల్స్ ఎన్నికలు అయ్యాక అధ్యక్షులను ప్రకటించే అవకాశం
జిల్లాల్లో పదుల సంఖ్యలో దరఖాస్తులు.. అదృష్టం ఎవరిని వరిస్తుందో?
మహబూబ్‌నగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్లు అధికారంలో లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల్లో నియామకాలు ఆయా ప్రాంతాల సీనియర్ లీడర్ల కనుసన్నల్లోనే జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రె్‌సలోకి ఇతర పార్టీల నుంచి భారీ గా వలసలు వచ్చా రు. కొందరు టికెట్లు దక్కించుకుని పోటీచేసి గెలిచారు. గతంలో మాదిరిగా సీనియర్ నాయకులు చెబితే పార్టీ పదవులకు నాయకులను ఎంపిక చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ పదవులపై దృష్టి పెట్టాల్సి ఉండగా.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడం, పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య వర్గపోరు ఉండటంతో కొంత తాత్సారం జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. పీసీసీ పదవులను భర్తీ చేయగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన చాలామందికి అందులో అవకాశం దక్కింది. ఇక మిగిలింది డీసీసీ అధ్యక్షుల నియామకం. వాటిని కూడా భర్తీ చేసే పనిని పార్టీ ప్రారంభించింది. అందుకోసం గత నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఏఐసీసీ నియమించిన పరిశీలకులు ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. అధ్యక్ష పదవి కోరుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో ఆయా జిల్లాల నుంచి పదుల సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం పార్టీ పెట్టుకున్న కొన్ని నిబంధనలే ఇప్పుడు తంటాలు తెచ్చిపెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పారామీటర్స్‌ను పక్కకు పెడుతూ కూడా ఎంపికలు ఉండవచ్చనే చర్చ కూడా జరుగుతోంది.
పారా మీటర్స్ పక్కకే..
డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం అయిదేళ్లపాటు క్రమశిక్షణతో, నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నవారు అయ్యి ఉండలానే నిబధన పెట్టుకున్నారు. అలా లేని దరఖాస్తులను ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎంపికైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ డీసీసీ పీఠానికి పరిగణలోకి తీసుకోరని, అలాగే పారీకి చెందిన ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అవకాశం కల్పించడం లేదని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాగా ఏఐసీసీ ఏర్పాటు చేసిన పారామీటర్స్‌ను పరిగిణలోకి తీసుకుంటే చాలా జిల్లాల్లో డీసీసీ పదవికి సమర్థులను ఎంపిక చేయలేని దుస్థితి నెలకొంది. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు చాలామందే దరఖాస్తుదారుల్లో ఉన్నారు. కానీ వారు పార్టీని సమర్థంగా నడిపించగలరా? అనేది ప్రశ్నగా ఉంది. అలాగే ప్రజాదరణ విషయంలో కూడా చాలా తేడా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే కాస్త ముందు మాత్రమే అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వలస వచ్చారు. ఐదుగురు బీఆర్‌ఎస్ నుంచి రాగా.. గద్వాలలో సరిత మినహా అందరూ గెలుపొదారు. వారితోపాటు రెండోశ్రేణి నాయకులు కూడా చాలామంది చేరారు. వారందరికీ ఐదేళ్ల నిబంధన అడ్డువస్తోంది.
జిల్లాల్లో ఇలా..
ఏఐసీసీ ఇచ్చిన నిబంధనల్లో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారిని మరోసారి కొనసాగించబోమని ఉంది. అయితే నారాయణపేటలో ప్రశాంత్‌రెడ్డి మరోసారి ఆశిస్తున్నారు. ఆయన ఇతర డీసీసీ అధ్యక్షులు ఉన్నంతకాలం లేరు. వాకిటి శ్రీహరి తర్వాత ఆయనకు ఆ పదవి వరించింది. అయితే ఈసారి కూడా ఆయన ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఆయననే ఎంపిక చేస్తారనే టాక్ నడుస్తోంది. దీనివల్ల మరో పారామీటర్‌ను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఆరుగురు బరిలో ఉన్నారు. కొడంగల్ ప్రాంతానికి చెందిన మహిళా నాయకురాలు ప్రసన్నారెడ్డి కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో సుమారు 20 మంది డీసీసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రజాప్రతినిధి నిబంధనను కాదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజే్‌షరెడ్డివైపు సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు బిజినేపల్లి మండలానికి చెందిన సుహాసన్‌రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్, యూత్ కాంగ్రెస్ నుంచి కొడిదెల రాము, కల్వకుర్తి నుంచి విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జగన్, కొల్లాపూర్ నుంచి రాము యాదవ్, అచ్చంపేట నుంచి హనుమంతరావు కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. రెండో అధికార కేంద్రం కాకుండా.. గతంలో బీఆర్‌ఎస్ అమలు చేసిన ఫార్ములానే కాంగ్రెస్ అమలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు సూచించిన వారికే పదవులు ఇస్తే మేలనే అభిప్రాయ ఉంది. లేకపోతే వర్గపోరు పెరిగి, సంస్థాగతంగా పలుచనవుతామని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ మరోసారి అవకాశం కోరుతుండగా.. సీనియర్ నాయకులు ఎన్‌పీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, సంజీవ్ ముదిరాజ్, బెక్కరి అనితతోపాటు ఎంఎ్‌సఎన్ గ్రూపు నుంచి రాజకీయాల్లో వచ్చిన జీవన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువ మంది ఆశావహులు ఉండటం.. అందరూ సీనియర్లే కావడంతో విభేదాలు రాకుండా.. మరోసారి జీఎంఆర్‌కే అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే జీవన్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు.
గద్వాలలో ప్రధానంగా సంపత్‌కుమార్ కుమారుడు దీపక్ ప్రజ్ఞ, గద్వాల ఇన్‌చార్జి సరిత మధ్యన పోటీ కనిపిస్తోంది. మరికొందరు ఆశిస్తున్నా.. పార్టీ ఈ ఇద్దరినే ప్రధాన పోటీదారులుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వనపర్తి నుంచి లక్కాకుల సతీష్, సీనియర్ నాయకులు కిరణ్‌కుమార్, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. మేగారెడ్డి సతీ్‌షకు మద్దుతుగా ఉండగా.. చిన్నారెడ్డి కిరణ్‌కుమార్ లేదా రాజేంద్రప్రసాద్‌కు అండగా ఉన్నారు. అయితే రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కొనసాగుతున్నందున కిరణ్‌వైపు అవకాశాలు ఉంటాయి. అయితే వర్గపోరు ఉన్నచోట ఎమ్మెల్యేల వైపు పార్టీ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కనీసం మూడు డీసీసీలు ఎమ్మెల్యేలకే కట్టబెట్టే అవకాశం ఉంది.