ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:09 PM
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు ఆదేశించారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 156 ఫిర్యాదులు రాగా, కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇచ్చిన ప్రతీ దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అఽధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారంలో జాప్యం చేయొద్దని, శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, ఏనుగు నరసింహారెడ్డి, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు పాల్గొన్నారు.
రీజినల్ రింగురోడ్డు మార్పు చేయాలి..
బాలానగర్ మండలం, చిన్నరేవల్లి గ్రామాల్లోని సర్వే నెంబర్ల వ్యవసాయ భూముల నుంచి వెళ్లే రీజినల్ రింగురోడ్డును మార్చాలని కోరుతూ చెన్నరేవల్లి గ్రామ రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 300పై కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని వినతిలో పేర్కొన్నారు.
దివ్యాంగుల పెన్షన్ పెంచాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం దివ్యాంగులకు పింఛన్ రూ.6వేలు పెంచాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. భిక్షపతి మాదిగ, శివకుమార్, నరేందర్, శ్రీరాము, భాస్కర్‌రెడ్డి, బాలరాజు, శ్రీలక్షి ఉన్నారు.