ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:07 PM
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి, వేగవంతంగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పేర్కొన్నారు.
- అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి, వేగవంతంగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భూసేకరణ, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్డీవో నవీన్‌కుమార్, మున్సిపల్ కమిష్నర్, జిల్లా అధికారులు 104 ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 104 ఫిర్యాదులు రాగా, పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు వర్షాకాలంలో వన మహోత్సవం కార్యక్రమంలో బాగంగా మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించిన లక్ష్యం మేరకు ఈనెల 10లోపు గుంతలు తీసి, సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేసీబీవీలు రెసిడెన్షియన్ పాఠశాలల్లో మండల ప్రత్యేకాధికారులు తనిఖీలు నిర్వహించి, నిర్దేశించిన యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
చెరువులో మట్టి తరలింపు ఆపాలి..
బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ పెద్ద చెరువు నుంచి మల్లమాంబా కంపెనీ వారు ఆర్‌సీ నెంబర్ ఇ,169, 2024 ఆర్డర్ కాపీ చూయించి 15 టిప్పర్ల మట్టిని తరలించారు. అదే ఆర్డర్ కాపీని చూయించి మళ్లీ ఈనెల 7న మిట్టి తరలించేందుకు వస్తున్నారని, దీన్ని ఆపాలని రంగారెడ్డిగూడ మత్య్స పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు శివప్రసాద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ చెరువులో చేపలున్నాయని, ఈ విషయంపై మండల అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.