Share News

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:10 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూసాపేట మండలం వేముల కోజెంట్‌ ఫార్మా కంపెనీలో రెండో యూనిట్‌ను సీఎం బుధవారం ప్రారంభించనున్నారు.

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
కోజెంట్‌ ఫార్మా కంపెనీలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

నేడు మూసాపేటకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

అధికారులతో కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి సమీక్ష

బందోబస్తుపై సూచనలు

మూసాపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూసాపేట మండలం వేముల కోజెంట్‌ ఫార్మా కంపెనీలో రెండో యూనిట్‌ను సీఎం బుధవారం ప్రారంభించనున్నారు. పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే, కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి మంగళవారం పరిశీలించారు. కంపెనీలో సీఎం ప్రారంభించే యూనిట్‌ను, ఇతర ఏర్పాట్లు, హెలిప్యాడ్‌ స్థలాన్ని ఎమ్మెల్యే జీఎంఆర్‌ పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తనివ్వొద్దని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీవో నవీన్‌, తహసీల్దార్‌లు రాజు, కిషన్‌నాయక్‌, శేఖర్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఉన్నారు.

అధికారులతో సమీక్ష

సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి బుధవారం శాఖల అధికారులతో సమీక్ష చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ అంబులెన్స్‌లు, అగ్నిమాపక శాఖ తమ వాహనం సిద్ధంగా ఉంచాలన్నారు. హెలీప్యాడ్‌ స్థల, మీటింగ్‌ ఏర్పాట్లు పర్యవేక్షించి, అధికారులకు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శివేంద్రప్రతాప్‌, ఆర్డీవో నవీన్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు.

956 మందితో పోలీస్‌ బందోబస్తు

మహబూబ్‌నగర్‌(ఆంధ్రజ్యోతి): సీఎం మూసాపేట పర్యటన సందర్భంగా 956 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వేముల కోజెంట్‌ పరిశ్రమ పరిసరాలను డాగ్‌స్క్వార్డ్‌, బాంబ్‌ స్క్వార్డ్‌లతో తనిఖీ చేశారు. పార్కింగ్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ జానకి మంగళవారం పరిశ్రమ ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశీలించారు. బందోబస్తుపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అక్కడే బందోబస్తు నిర్వహించే పోలీస్‌ అధికారులు, సిబ్బందితో సమావేశం అయ్యారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ట్రాఫిక్‌ నియంత్రణ, వీఐపీ రాకపోకలు, భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని చెప్పారు. బందోబస్తులో ఇద్దరు ఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు పాల్గొననున్నారు. వారితో పాటు 69 మంది ఎస్‌ఐలు, 173 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 461 మంది కానిస్టేబుళ్లు, 129 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, 89 మంది హోంగార్డులు బందోబస్తులో పాలుపంచుకోనున్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:10 PM