సీఎంఆర్ అప్పగింత వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:36 PM
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు.
- నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు
- అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు
- వనపర్తి, కొత్తకోట మండలాల్లో రైస్ మిల్లుల తనిఖీ
వనపర్తి రూరల్/ కొత్తకోట, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట మండలాల్లోని రైస్‌మిల్లులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వనపర్తి మండలంలోని కిష్టగిరిలో లక్ష్మీ నరసింహ ఇండస్ర్టీస్‌ను జిల్లా మేనేజర్, సివిల్ సప్లై సీఎస్ జగన్మోహన్, అసిస్టెంట్ మేనేజర్ బాలు నాయక్‌తో కలిసి తనిఖీ చేశారు. సీఎంఆర్ అప్పగింత ప్రస్తుత స్థితిని పరిశీలించారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం అప్పగింతలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. నిర్దేశిత సమయం కంటే ముందే సీఎంఆర్ అప్పగింత పూర్తి చేయాలని సూచించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులకు, మిల్లు యజమానులకు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి, పౌర సరఫరాల శాఖకు అందించడం ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం కొత్తకోట మండలంలోని ముమ్మళపల్లి, సంకిరెడ్డిపల్లి గ్రామాల శివారులోని ఆగ్రో ఇండ్రస్ట్రీస్, కొట్టం రైస్ మిల్లులను తనిఖీ చేశారు. సీఎంఆర్ అప్పగింతలో మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.