కోర్టు భవనం శంకుస్థాపనకు.. సీఎంను ఆహ్వానిస్తా
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:08 PM
పాలమూరులో అన్ని హంగులతో రూ.81 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు భవన నిర్మాణ భూమిపూజకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- రూ.35 లక్షలతో కోర్టు ఆవరణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : పాలమూరులో అన్ని హంగులతో రూ.81 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు భవన నిర్మాణ భూమిపూజకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్టు భవన నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో రూ.35 లక్షల ముడా నిఽధులతో చేపట్టే పార్కింగ్ షెడ్ పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని, వచ్చే 20 ఏళ్లలో నగరంలో కావల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. కోర్టు ఆవరణలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కంప్యూటర్లతో పాటు రీడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది ప్రతాప్‌కుమార్ విద్యానిధికి రూ.5 లక్షలు విరాళం ఇస్తానని, ఈ డబ్బును కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసే డిజిటల్ లైబ్రరీ కోసం వినియోగించాలని కోరారు. అనంతరం జిల్లా న్యాయవాదులకు హెల్త్‌కార్డులు పంపిణీ చేశారు. అంతకుముందు ముడా నిధులతో వీరన్నపేటలోని నీలకంఠస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.10 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ భవనం, రూ.15 లక్షలతో నిర్మించే యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రి, గోపాల్‌యాదవ్, శాంతన్నయాదవ్, అంజయ్య, కుర్వ రాములు, మల్లేశ్, రఘు, రాకేశ్, బార్‌అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అనంతరెడ్డి, శ్రీధర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కుర్మయ్య, ఇలియాస్, స్వదేశి, కృష్ణ, రమేశ్ పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ
నగరంలోని మినీ శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 400 మంది పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి పీపీఈ కిట్లు, యూనిఫాంలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలు పరిష్కరిస్తానని, ఆరోగ్యభీమా గురించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరానికి మంచి పేరు రావాలంటే పారిశుధ్య కార్మికులదే బాధ్యత అన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.