Share News

కీమోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:00 AM

జనరల్‌ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌లో కీమోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా అజ్మీర కోరారు.

కీమోథెరపీ సేవలను  సద్వినియోగం చేసుకోవాలి
కీమోథెరపీ సేవలను ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్‌

- జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా అజ్మీర

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) సెప్టెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి) : జనరల్‌ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌లో కీమోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా అజ్మీర కోరారు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలోని క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌లో కీమోథెరపీ సేవలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒక క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ను మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదట మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ప్రారంభించి, కీమోథెరపీ సేవలను అందించడం గర్వంగా ఉందన్నారు. మొదటి రోజు తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామానికి చెందిన రాములయ్య, కౌకుంట్ల మండలం పేరూరు గ్రామానికి చెందిన బాలస్వామిలకు కీమోథెరపి చేసినట్లు తెలిపారు. ప్రతీ రోజు 3 నుంచి 5 మందికి ప్యాలియేటివ్‌ సేవలను కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆంకాలజిస్టును, హైదరాబాద్‌ ఎంఎన్‌జే ఆసుపత్రి నుంచి కూడా ఒక ప్రొఫెసర్‌ను కూడా నియమించిందన్నారు. క్యాన్సర్‌ కీమోఽథెరపీ కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పని లేకుండా జిల్లాలోనే అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జనరల్‌ ఆసుపత్రి మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ అమరావతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాలశ్రీనివాస్‌, ఆంకాలజిస్టు డాక్టర్‌ రాహుల్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహ్మద్‌ గౌస్‌ మోహినుద్దిన్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునిల్‌కుమార్‌, ఏడీ డాక్టర్‌ ప్రేరణ, ఆర్‌ఎంవోలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:00 AM