Share News

రెండు ఎలిమెంట్లతో నీటి వృథాకు చెక్‌

ABN , Publish Date - May 24 , 2025 | 10:57 PM

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టులో దిగువకు వృథా నీరు వెళ్లకుండా శనివారం అధికారులు మరో రెండు స్టాఫ్‌ లాక్‌ ఎలిమెంట్‌ను అమర్చారు.

రెండు ఎలిమెంట్లతో నీటి వృథాకు చెక్‌
జూరాల ప్రాజెక్టులో భారీగా చేరిన వరద నీరు

- చివరి దశకు చేరిన మరమ్మతు పనులు

- ఎగువ నుంచి 4వేల క్యూసెక్కులకు పైగా వరద

అమరచింత, మే 24(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టులో దిగువకు వృథా నీరు వెళ్లకుండా శనివారం అధికారులు మరో రెండు స్టాఫ్‌ లాక్‌ ఎలిమెంట్‌ను అమర్చారు. ప్రాజెక్టు 40, 49, 56 గేట్ల వద్ద రూఫ్‌ వే తాడు మరమ్మతు కోసం జూరాల బ్యాక్‌ వాటర్‌లో ఇప్పటికే ఒక్కొక్క గేటు వద్ద 5 స్టాఫ్‌ లాక్‌ ఎలిమెంట్లను అమర్చి ముందు భాగం మరమ్మతు పనులు చేస్తున్నారు. అయినప్పటికీ ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ఎలిమెంట్లపై నుంచి దిగువకు గత ఐదు రోజులుగా వృథాగా నీరు వెళ్తూనే ఉన్నాయి. వరుస కథనాల కారణంగా శనివారం ప్రాజెక్టు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బీచుపల్లి ఆధ్వర్యంలో మరమ్మతులు జరుగుతున్న ఒక్కొక్క గేటు వద్ద మరో రెండు స్టాఫ్‌ లాక్‌ ఎలిమెంట్లను అమర్చి, ప్రస్తుతం దిగువకు వరద నీరు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం 5.012 టీఎంసీల నీరు ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు శనివారం ఎగువ నుంచి 4172 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులో చేరింది. దీంతో గత వారం 2 టీఎంసీలకు పడిపోయిన జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలు తాజాగా ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా 5 టీఎంసీలకు చేరిందని చెప్పవచ్చు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయమే జూరాల ప్రాజెక్టు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బీచుపల్లిని వివరణ కోరగా మిగిలిన 3 గేట్ల వద్ద మరమ్మతు పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Updated Date - May 24 , 2025 | 10:57 PM