చిట్టీల పేరుతో చీటింగ్
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:30 PM
భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య నాగర్‌కర్నూల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కాంట్రాక్టు ఏఎన్‌ఎంగా పని చేస్తోంది.
- నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ
- రూ. 15 కోట్లు స్వాహా చేసిన దంపతులు
- సిక్ లీవ్ పెట్టి మాయమైన భర్త, నాకేం తెలియదంటున్న భార్య
- సహోద్యోగులు, స్నేహితులు, బంధువులే బాధితులు
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య నాగర్‌కర్నూల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కాంట్రాక్టు ఏఎన్‌ఎంగా పని చేస్తోంది. దంపతులు ఇద్దరూ కలిసి చిట్టీలు, డిపాజిట్ల పేరుతో వందలాది మందితో డబ్బు వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. ఈ ఉదంతం నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. అతడు నాగర్‌కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య నాగర్‌కర్నూల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కాంట్రాక్టు ఏఎన్‌ఎంగా పని చేస్తోంది. ఇద్దరూ కలిసి చట్ట వ్యతిరేకంగా రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా కూడా చిట్టీలు నిర్వహించారు. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తానని చెప్పి డిపాజిట్లు కూడా సేకరించారు. డిపాజిట్లుగా సేకరించిన డబ్బుకు వందకు రూ. 2 రూపాయల చొప్పున వడ్డీ ఇస్తామని నమ్మించారు. దీంతో వారి సహోద్యోగులు స్నేహితులు, బంధువులు వారి వద్ద చిట్టీలు వేశారు. చాలా మంది డబ్బు డిపాజిట్ చేశారు. ఇలా ఆ దంపతులు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేశారు.
మెడికల్ లీవ్ పెట్టి పరార్
సహోద్యోగులు, స్నేహితుల నుంచి డబ్బు వసూలు చేసిన ఆ ఉపాధ్యాయుడు వారం రోజులుగా కనిపించడం లేదు. అనారోగ్యం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని సదరు ఉపాధ్యాయుడు విద్యాశాఖకు మెడికల్ లీవ్ సమర్పించి మాయం అయ్యాడు. దీంతో వారి వద్ద చిట్టీలు కట్టిన వారు, డబ్బు డిపాజిట్ చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు.. ఆ దంపతులు అద్దెకు ఉంటున్న ఇంటికి ప్రస్తుతం తాళం వేసి ఉంది. బాధితులు ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అతడి భార్య మాత్రం అప్పుడప్పుడు విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. అడిగిన వారికి తనకేమీ తెలియదని తెలియదని సమాధానమిస్తున్నట్లు తెలిసింది.
ఓ వైద్య ఉద్యోగికి పక్షవాతం
వారి వద్ద అధిక మొత్తం డబ్బు డిపాజిట్ చేసిన ఓ వైద్య ఉద్యోగి సొమ్ము తిరిగి రాదన్న బెంగతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యాశాఖలో తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు. వివాహం తర్వాత చాలా కాలానికి అతడి భార్యకు కూడా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు నెల నెలా కూడబెట్టుకున్న సొమ్మును సదరు దంపతుల వద్ద డిపాజిట్ చేశారు. తీరా వారు మోసం చేయడంతో అతడు మానసికంగా కుంగిపోవడంతో పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యం కోసం సహాయం చేయండంటూ అతను సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న విజ్ఞప్తి, అందరినీ కలిచివేస్తోంది.