Share News

సీసీఐ కొనుగోళ్లు ఎప్పుడో!

ABN , Publish Date - Oct 07 , 2025 | 10:55 PM

అధిక వర్షపాతం.. ఎడతెరిపి లేని వర్షాలతో పత్తిసాగు చేసిన రైతులు.. ప్రస్తుతం పత్తి సేకరణ సీజన్‌ ప్రారంభం కావడంతో సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.

సీసీఐ కొనుగోళ్లు ఎప్పుడో!
జడ్చర్ల మండలం తంగెళ్లపల్లిలో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంట

ఎదురు చూస్తున్న ఉమ్మడి జిల్లా పత్తి రైతులు

ప్రారంభమైన పత్తిసేకరణ..

మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్న దళారులు అమ్మకం

గతేడాదితో పోల్చితే 1.19 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు

భారీ వర్షాలతో నాని నల్లగా మారిన తెల్ల బంగారం

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధిక వర్షపాతం.. ఎడతెరిపి లేని వర్షాలతో పత్తిసాగు చేసిన రైతులు.. ప్రస్తుతం పత్తి సేకరణ సీజన్‌ ప్రారంభం కావడంతో సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసి.. ఎక్కువకు విక్రయించారని విజిలెన్స్‌ విచారణలో తేలడంతో.. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా రైతులే స్లాట్‌ బుక్‌ చేసుకుని విక్రయించేలా సంస్కరణలు తెచ్చింది. ఈ సంస్కరణలను జిన్నింగ్‌ మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో కొనుగోళ్ల కోసం గత సెప్టెంబరులోనే టెండర్లు దాఖలు చేయాల్సి ఉండగా.. చేయలేదు. తాజాగా మంత్రి తుమ్మల జిన్నింగ్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించి.. కొనుగోళ్లకు ఒప్పించారు. ఇకపై టెండర్లు దాఖలవుతాయని ఆశిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేస్తుండటంతో రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని పాటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన కొనుగోళ్లు ఇంకా కాలేదు. పత్తి సేకరణ ప్రారంభించిన రైతులు కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.

మూడో వారంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం

ఉమ్మడి పాలమూరులోని ఆయా జిల్లాల్లో పత్తి కొనుగోళ్ల కోసం సమీక్షలు నిర్వహించిన కలెక్టర్లు.. అక్టోబరు మొదటివారం నుంచే కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పగా, ఇప్పటికే రెండో వారం వచ్చింది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం మూడో వారంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సేకరిస్తున్న పత్తి వర్షాల కారణంగా నల్లగా మారడంతో మార్కెట్‌లో అనుకున్న ధరలు లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించింది. కానీ అంతకంటే తక్కువ ధరకు జిన్నింగ్‌ మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం రూ.5 వేల వరకు కొనుగోలు చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేస్తే దళారులు, జిన్నింగు మిల్లర్లు తక్కువకు కొనుగోలు చేయడం వల్ల అప్పులపాలవుతామని వాపోతున్నారు.

1.19లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు..

ఉమ్మడి పాలమూరులో నాగర్‌కర్నూల్‌, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పత్తి సాగు అధికంగా జరుగుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 6.42 లక్షల ఎకరాల్లో పత్తిసాగు కాగా, ఈ ఏడాది 7.61 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు సమయానికి కురవడంతో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపారు. గతేడాది కంటే 1.19 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తిసాగు చేశారు. అయితే సాధారణం కంటే వర్షాలు ఎక్కువగా కురవడం, ముసురు వానలు పడటం వల్ల పత్తి దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు దిగుబడి తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. రెండుసార్లు పత్తి తీస్తే ఎక్కువ అని భావిస్తున్నారు. సాధారణంగా ఎకరాకు ఆరు నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని చెప్పొచ్చు.

వర్షాలకు నల్లగా మారిన పత్తి

ముందస్తుగా సాగు చేసిన చేలల్లో పత్తి ఏరుతున్నారు. పగిలిన పత్తి వానలకు నాని నల్లగా మారగా, పగలని కాయలు మురిగిపోతున్నాయి. పత్తి తీయాలంటే కూలీల ఖర్చు కూడా ఎక్కువ అవుతోందని రైతులు చెబుతున్నారు. సాధారణంగా రైతులు ధర లేకుంటే ఇళ్లల్లోనే ఉంచుకుని ధర వచ్చే వరకు లేదా.. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వరకు ఎదురుచూస్తారు. కానీ పత్తి నల్లగా మారడంతో వచ్చిన పత్తిని వచ్చినట్లు దళారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు అత్యంత తక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

జిన్నింగ్‌ మిల్లర్ల వల్లే ఆలస్యమా?

సీసీఐ ద్వారా గతేడాది ఉన్న కొనుగోలు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చింది. పాత విధానంలో రైతుల పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు తీసుకుని వ్యాపారులు వారి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి.. సీసీఐకి మద్దతు ధరకు విక్రయించి అవకతవకలకు పాల్పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. సీసీఐ, మార్కెటింగ్‌ శాఖల్లో జరిగిన ఈ అవినీతిపై విజిలెన్స్‌ విచారణ కూడా చేసి నిర్ధారించుకుంది. దీంతో ఈసారి కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారానే రైతులు నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని జిన్నింగ్‌ మిల్లులకు పత్తి తరలించేలా ఏర్పాట్లు చేసింది. దీన్ని మిల్లర్లు ఇన్నాళ్లు వ్యతిరేకించారు. పాత విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని సీసీఐపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్టోబరులో కొనుగోళ్ల కోసం టెండర్ల దాఖలుకు సెప్టెంబరు చివరి వారం ఆఖరు కాగా.. టెండర్లు వేయలేదు. తాజాగా టెండర్లు వేసేందుకు అంగీకరించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అధికం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. నారాయణపేట జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.37 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 13 లక్షల నుంచి 16 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2.19 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. 20 వేల బేళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు. దిగుబడి తగ్గినప్పటికీ సాగు పెరగడంతో సేకరణను త్వరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. పత్తి మంచిగా ఉంటే 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి దాదాపు 2 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవైపు వరణుడు నష్టం కలిగించగా.. ఇంకోవైపు సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

Updated Date - Oct 07 , 2025 | 10:55 PM