కారు, లారీ, డీసీఎం ఢీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:37 PM
స్కూటీని తప్పించబోయి ఓ కారు ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొన్నది. ఆ కారును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్నది. ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది.
- ఓ మహిళ దుర్మరణం, నలుగురు గాయాలు
మూసాపేట, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : స్కూటీని తప్పించబోయి ఓ కారు ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొన్నది. ఆ కారును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్నది. ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా, మూసాపేట మండలంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. అడ్డాకుల ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం, సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలు దేరారు. అడ్డాకుల మండలం కందూరు స్టేజీ వద్దనున్న వంతెనపై ముందు వెళ్తున్న డీసీఎంకు ఓ స్కూటీ హఠాత్తుగా అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న కారు డీసీఎంను ఢీకొన్నది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆ కారును ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శోభారాణి (50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారులో ఉన్న ఎల్లారెడ్డి, విమల, డ్రైవర్ రవీందర్‌తో పాటు స్కూటీపై వస్తున్న కొమిరెడ్డిపల్లికి చెందిన రఘుపతిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా దెబ్బతిన్న కారులో నుంచి క్షతగాత్రులను వెలికి తీసి అంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తరలించారు. రఘుపతిరెడ్డి కందూరు సాయిబాబా గుడికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనాలు రహదారికి అడ్డంగా పడటంతో కొద్దిసేపు రాకపోకలకు ఆటంకం కలిగింది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.