Share News

త్వరలో తీగల వంతెన పనులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:32 PM

సోమశిల - సిద్దేశ్వరం కొండల నడుమ ఐకానిక్‌ తీగల వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎంపీ ఈటెల రాజేందర్‌ తెలిపారు.

త్వరలో తీగల వంతెన పనులు
సోమశిల వద్ద తీగల వంతెన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్‌, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎల్లేని సుధాకర్‌రావు

- ఎంపీ ఈటల రాజేందర్‌ 8 నిర్మాణ స్థలం పరిశీలన

కొల్లాపూర్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సోమశిల - సిద్దేశ్వరం కొండల నడుమ ఐకానిక్‌ తీగల వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎంపీ ఈటెల రాజేందర్‌ తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు నేతృత్వంలో, నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కొల్లాపూర్‌ మండల పరిధిలోని సోమశిల వద్ద కృష్ణానదిలో నాయకులతో కలిసి బోటింగ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెన నిర్మించనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఐకానిక్‌ తీగల వెంతనను మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమై, వేగవంతంగా పూర్తి అవుతాయని తెలిపారు. ఇప్పటికే 167కే జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పట్టుబట్టి వీటిని సాధించిన ఘనత ఎల్లేని సుధాకర్‌రావుదేనని తెలిపారు.

Updated Date - Nov 21 , 2025 | 11:32 PM