మందకొడిగా పత్తి కొనుగోలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:27 PM
రైతులు కష్టపడి పండించిన పత్తిని విక్రయించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. సీసీఐ ద్వారా విక్రయిద్దామంటే కపాస్ యాప్‌లో స్లాట్ బుక్‌కావడం లేదు.
- నేటికీ ప్రారంభం కాని మరో మిల్లు
- గద్వాల జిల్లాలో 1,55,641ఎకరాల్లో పత్తి సాగు
- దిగుబడి అంచనా 22 లక్షల క్వింటాళ్లు
- ఇప్పటికి సీసీఐ కొన్నది 9వేల క్వింటాళ్లే..
- కపాస్ యాప్‌లో స్లాట్ బుక్‌కాకపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులు
గద్వాల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి) రైతులు కష్టపడి పండించిన పత్తిని విక్రయించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. సీసీఐ ద్వారా విక్రయిద్దామంటే కపాస్ యాప్‌లో స్లాట్ బుక్‌కావడం లేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పం ట దెబ్బతినడం, తేమ శాతం ఎక్కువగా ఉండటం తో వారు కూడా తక్కువ ధరకు అడుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తిసాగు అధికంగా ఉన్నప్పటికీ అందుకు తగిన జిన్నింగ్ మిల్లులు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
మొదటి విడత పత్తి రాయిచూరుకే..
గద్వాల జిల్లాలో ఈ ఏడాది 1లక్షా55 వేల 641ఎకరాలలో పత్తి సాగు చేశారు. ఇతర జిల్లాలతో పోలిస్తే గద్వాల జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైంది. దీంతో పత్తి దిగుబడి మామూలుగా వచ్చింది. 22లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు మార్కెటింగ్ అధికారులకు నివేదిక ఇచ్చారు. మొదట విడుతలో వచ్చిన పత్తి నాణ్యత తక్కువగా ఉండటంతో రైతులు మధ్య దళారుల ద్వారా రాయిచూరులో విక్రయించారు. రెండో విడత, ప్రస్తుతం వచ్చినపత్తి నాణ్యతగా ఉం డటంతో రైతులు ఇళ్ల వద్దే నిల్వ చేసుకున్నారు. ఈ లోపే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం రైతులకు కొంత ఊరటనిచ్చింది. జిల్లాలో పత్తి మార్కెట్ లేకపోవడంతో దళారులు పుట్టుకొస్తున్నా రు. ప్రస్తుతం 200మందికి పైగా ఉన్నారు. వీరు ఒక్కొక్కరు ప్రతీ రోజు 30నుంచి 35 క్వింటాళ్ల పత్తిని రాయిచూర్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గత నెల 27వ తేదీన ఆలంపూర్ చౌరస్తాలో, ఈ నెల 3వ తేదీన గద్వాలలో సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించడంతో వారి వ్యాపారం నెమ్మదించింది.
సామర్థ్యం లేని జిన్నింగ్ మిల్లులు
జిల్లాలో మూడు జిన్నింగ్ మిల్లులకు కొనుగోలు అనుమతులు వచ్చాయి. ఇందులో ఒకటి ఆలంపూ ర్ చౌరస్తాలో ఉంది. దీని సామర్థ్యం ప్రతీ రోజు 2,100 క్వింటాళ్లే, గద్వాలలో ఉన్న మిల్లు సామర్థ్యం 1,350 క్వింటాళ్లు మాత్రమే.. అలంపూరు చౌరస్తాలో ని మిల్లులో గత నెల 27వ తేదీన పత్తి కొనుగోలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 7,577 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. గద్వాలలోని మిల్లులో ఈ నెల 3వ తేదీ నుంచి కొనుగోలు ప్రారంభించగా ఇప్పటి వరకు 1,760 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. హరిత కాటన్ జిన్నింగ్ మిల్లు లో ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదు. ఈ మిల్లు సామర్థ్యం 2,100 క్వింటాళ్లు మాత్రమే. మూడింటిని కలిపినా ప్రతీ రోజు 5,550 క్వింటాళ్లను మించి సీసీఐ కొనుగోలు చేయలేదు.
కిసాన్ కపాస్ యాప్‌తో తిప్పలు..
కిసాన్ కపాస్ యాప్‌తో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి టార్గెట్ పూర్తి కాగానే యాప్‌లో ఆ బిల్లు బ్లాక్ అవుతోంది. మళ్లీ మరుసటి రోజే ఓపెన్ అవుతున్నది. ఈ సమ స్య పరిష్కారానికి రైతులకు ఒక షెడ్యూల్ ఇచ్చి మూడు రోజులకు ఒకేసారి స్లాట్ బుక్‌చేసుకునేలా.. అవి పూర్తిగాకానే మళ్లీ మూడు రోజులకు స్లాట్ బుక్ చేసుకునే విధానం అమలు చేయాలని కలెక్టర్ సీసీఐ అధికారులను ఆదేశించారు. అయితే వారు మాత్రం మేనేజర్ నుంచి అనుమతి వస్తే తప్ప చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రతీ రోజు స్లాట్ బుకింగ్ కోసం రైతులు ఇబ్బంది పడుతు న్నారు.