కుటుంబ పోషణ భారం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:24 PM
పెరి గిన నిత్యావసర సరుకుల ధరలు, పనికి తగిన వేత నాలు లేక మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
- 4 నెలలుగా అందని గౌరవ వేతనం
- ఇబ్బందుల్లో మధ్యాహ్న భోజన కార్మికులు
- 9 నెలలుగా మంజూరు కాని గుడ్ల బిల్లులు
- ఉమ్మడి జిల్లాలో దాదాపు 6 వేల మంది కార్మికులు
అమరచింత, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పనికి తగిన వేత నాలు లేక మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో కీలకపాత్ర పోషిస్తున్న వంట పనివారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా రు. విద్యాశాఖ నిర్ణయించిన మెనూ ప్రకారం వంటలు చేసి, సకాలంలో విద్యార్థుల ఆకలి తీరుస్తున్న వీరికి ఇస్తున్న వేతనాలు ఎంత మాత్రమూ సరిపోవడం లేదు. ఇచ్చే అంతంత మాత్రం వేతనాలు కూడా సకా లంలో ఇవ్వకపోవడం సమస్యగా మారింది. వంట సామగ్రికి సంబంధించిన బిల్లులను కూడా ప్రభుత్వం ప్రతీ నెల విడుదల చేయడం లేదు. ఐదు, ఆరు నెలల కోసారి ఇస్తుండటంతో సరుకులు తేవడం కష్టమవు తోంది. ఒక్కో సారి అప్పు చేసి ఖర్చు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
వనపర్తి జిల్లాలో 1200 మంది కార్మికులు
మధ్యాహ్న భోజన పథకం కింద ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 6 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అందులో వనపర్తి జిల్లాలో 1,200 మంది వరకు కార్మికులున్నారు. కొన్ని పాఠశాలల్లో వంట గదులు అసంపూర్తిగా ఉన్నాయి. మరి కొన్ని బడుల్లో వంట గదులే లేక ఆరు బయటే వంటలు చేయాల్సి వస్తోంది. వంట చేసేందుకు అవసరమైన సిలిండర్లు సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యి మీదనే వండాల్సి వస్తోంది. కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగతో శ్వాసకోశ వ్యాధులు, కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయినా వారికి ప్రభుత్వం ఆరోగ్య, జీవిత బీమా, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించడం లేదు.
పెండింగ్‌లో వేతనాలు
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 4 నెలలుగా ప్రభుత్వం గౌరవ వేతనం మంజూరు చేయడం లేదు. ఇచ్చే రూ. 3 వేల రూపాయలు కూడా ప్రతీ నెల ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనం కూడా సక్రమంగా ఇవ్వకపోవడంపై అసంతృప్తి చెందు తున్నారు. దీనికి తోడు కోడిగుడ్లకు సంబంధించిన బిల్లులు కూడా 9 నెలలుగా మంజూరు కావడం లేదు. మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్లు తప్పని సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అప్పు చేసి గుడ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు వారు చెప్తున్నారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో మధ్యాహ్నభోజన కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని, ప్రతీ నెల బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
బిల్లులు అందక అవస్థలు
దేవమ్మ, వంట కార్మికురాలు, అమరచింత : గౌరవ వేతనం 4 నెలలుగా అందడం లేదు. గుడ్డు బిల్లులు 9 నెలలుగా రాలేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం చెప్తున్నా, బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి.
గౌరవ వేతనం పెంచాలి
ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి, ప్రగతి శీల మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వంట కార్మికులకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలి. కహామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. కార్మికులకు రూ. 10 లక్షల బీమా సదుపాయం కల్పించాలి.