భూ భారతిపై చిగురిస్తున్న ఆశలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:44 PM
భూ సమస్యల పరిష్కార మే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
- రెవెన్యూ సదస్సులకు దరఖాస్తుల వెల్లువ
- ఏళ్లనాటి సమస్యలు పరిష్కారం అవుతాయనే ధీమాలో ఫిర్యాదుదారులు
- ఇప్పటి వరకు 14 మండలాల్లో 5,219 దరఖాస్తులు
- ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్న సదస్సులు
వనపర్తి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : భూ సమస్యల పరిష్కార మే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పరి ష్కారానికి నోచుకోని భూ సమస్యలతో సతమతమవుతున్న వారు భూ భారతితో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టం వలన ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చాయి. భూ సమస్యలు పూర్తిగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారు.
ఆన్‌లైన్‌లో నమోదు
భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి నుంచి వినతులు స్వీకరించేందుకు గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నా రు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో ఈ నెల 3వ తేదీన ప్రారంభించిన రెవెన్యూ సదస్సులు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు 211 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 5,219 దరఖాస్తులు అందాయి. వచ్చిన దరఖాస్తులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సాదా బైనామా, అసైన్డ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి మిగిలిన వాటిని పరిశీలిస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారికి నోటీసులు జారీ చేసి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
మార్గదర్శకాలు ఇలా
రెవెన్యూ అధికారులు దరఖాస్తులు పరిశీలించి ఫిర్యాదు సమర్పించిన రైతుతో పాటు సమీపంలోని రైతుకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇరువురి వద్ద ఉన్న రికార్డులతో పాటు ఆధారాలు సమర్పించేందుకు ఏడు రోజులు గడువు విధిస్తారు. నిర్దేశిత గడువులోపు సమర్పించిన ఆధారాలు, దస్ర్తాలను రెవెన్యూ కార్యాల యంలోని రికార్డులతో పోల్చిచూసి సమస్యను పరిష్కరించనున్నారు.