వృద్ధుడి దారుణ హత్య
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:23 PM
ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది.
- వనపర్తి జిల్లా పాన్‌గల్‌లో కలకలం
పాన్‌గల్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. పాన్‌గల్ గ్రామానికి చెందిన ఎనుముల కిష్టయ్య (68) ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ వడ్డీలకు డబ్బులు ఇస్తూ మూగజీవాల వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం బోనాల పండుగ సందర్భంగా అదే గ్రామంలో ఉండే కుమారుడి ఇంట్లో భోజనం చేసి తాను ఉంటున్న ఇంటికి వచ్చాడు. ప్రతీరోజు మాదిరిగానే తన ఇంట్లో నిద్రించాడు. గురువారం ఉదయం అటుగా వెళుతున్న ఓ మహిళ ఇంట్లోకి కోతులు వస్తున్నాయని, ఇల్లు మూసుకోమని చెప్పినా ఆయన నుంచి సమాధానం రాలేదు. దీంతో గది మూత దగ్గరకు వచ్చి చూడగా కిష్టయ్య మంచంపై రక్తపు మరకలతో పడి ఉండటాన్ని గమనించిన ఆమె చుట్టుపక్కల ఇళ్ల వారికి విషయం చెప్పింది. సమాచారం అందుకున్న మృతుని కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ముఖంపై అతి దారుణంగా దాడి చేసిన రక్తపు గాయాలతో మృతి చెంది ఉన్నాడు. అతని వెంట ఉన్న వారే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుని కుమారుడు శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ కృష్ణ తెలిపారు. సీసీఎస్ పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో హత్య వివరాలను సేకరించారు. వృద్ధుని హత్యతో ఒక్కసారిగా మండల కేంద్రంవాసులు ఉలిక్కిపడ్డారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
పాన్‌గల్‌లో హత్య జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పాన్‌గల్ ఎస్‌ఐ శ్రీనివాస్ ఉన్నారు.