తెగుతున్న సం‘బంధాలు’
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:16 PM
మహబూబ్‌నగర్/గద్వాల క్రైం/నాగర్‌కర్నూల్ క్రైం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏడడుగుల బంధం ప్రియుడి మోజులో పడి బంధీ అవుతోంది. వివాహేతర సంబంధాలతో భార్యలు భర్తలను హత్య చేస్తున్నారు. చదువుకునే వయసులో ఆకర్షణకు లోనవుతున్న యువతులు ప్రేమ పేరుతో గడప దాటుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
ప్రియుడిపై మోజుతో భర్తలను హత్య చేస్తున్న భార్యలు
రాష్ట్రంలో సంచలనం రేపిన తేజేశ్వర్ హత్య
ఉమ్మడి జిల్లాలో 400 అత్యాచార కేసులు నమోదు
పోక్సో కేసులు 300..
ప్రేమ పేరుతో గడపదాటుతున్న యువత
రోడ్డు ప్రమాదాల్లో వెయ్యి మంది దుర్మరణం
అవినీతి అధికారులకు చెక్ పెడుతున్న అవినీతి నిరోధక శాఖ
మహబూబ్‌నగర్/గద్వాల క్రైం/నాగర్‌కర్నూల్ క్రైం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏడడుగుల బంధం ప్రియుడి మోజులో పడి బంధీ అవుతోంది. వివాహేతర సంబంధాలతో భార్యలు భర్తలను హత్య చేస్తున్నారు. చదువుకునే వయసులో ఆకర్షణకు లోనవుతున్న యువతులు ప్రేమ పేరుతో గడప దాటుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారిలో బాలికలే అధికంగా ఉంటున్నారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వెయ్యి మంది మరణించగా, మరెందరో క్షతగాత్రులుగా మారారు. గంజాయి వాడకం పెరుగుతుండగా, సైబర్ నేరాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ ఏడాది ఎన్నో సంచలన కేసులు వేదికగా మారింది. అందుకు సంబంధించి క్రైం రివ్యూ..
వివాహేతర సంబంధాలతో..
వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. గద్వాలలో జరిగిన ఉదంతం రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించింది. పెళ్లికి ముందు బ్యాంక్ ఉద్యోగితో సంబంధం పెట్టుకున్న తేజస్విని ఆతరువాత తేజేశ్వర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నెల రోజులకే ప్రియుడు తిరుమల రావుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. అందుకు తేజస్విని తల్లి కూడా సహకరించింది. తిరుమల రావు స్నేహితులకు సుపారి ఇచ్చి తేజేశ్వర్‌ను కారులో కిడ్నాప్ చేసి కర్నూల్ జిల్లా పాణ్యం వద్ద హత్య చేశారు. దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్‌కు చెందిన దానం మైబు కుమారుడు అనిల్ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు మైబుతో గొడవపడ్డారు. చివరకు రౌడీ షీటర్లను ఆశ్రయించి రూ.8 లక్షలకు సుపారి మాట్లాడుకుని మైబును వేటకొడవళ్ళతో హత్య చేయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడాది కాలంగా వందకు పైగా హత్యలు జరుగగా, అందులో పాలమూరు జిల్లాలోనే 21 జరిగాయి.
రహదారులపై నెత్తుటి మరకలు
రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా రహదారులపై బ్లాక్ స్పాట్‌లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది వెయ్యి మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా, రెండువేలకు పైగా క్షతగాత్రులుగా మారుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 631 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. అందులో 270 మంది దుర్మరణం పాలవగా, 550 మంది క్షతగాత్రులయ్యారు.
అవినీతి భరతం పడుతున్న ఏసీబీ
పాలమూరు జిల్లాలో అవినీతి అధికారులకు ఏసీబీ అధికారులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. పాలమూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సోదాలు చేశారు. రూ.200 కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అదేవిధంగా జిల్లాకు చెందిన ల్యాండ్ సర్వేయర్ అధికారి శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారని ఆయన ఇళ్లపై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడాది 15 మంది అవినీతి అధికారులు, సిబ్బందికి ఏసీబీ చెక్ పెట్టింది.
అత్యాచారాలతో హడల్
ఉమ్మడి జిల్లాలో అత్యాచారాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈనెలలో మూసాపేట మండలంలోని ఓ గ్రామంలో జరిగిన అత్యాచార ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో బాలిక చనిపోయింది. ఒక్క పాలమూరు జిల్లాలోనే 113 అత్యాచారాలు చోటుచేసుకోగా ఉమ్మడి పాలమూరులో 400 వరకు అత్యాచారాలు జరిగాయి. 300 వరకు పోక్సో కేసులు నమోదయ్యాయి. బాలికలపై నిత్యం అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళల వేధింపులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. పాలమూరులోనే 495 కేసులు నమోదుకావడం గమనార్హం.
దోపిడీకి అడ్డేది
గతంతో పోలిస్తే దొంగతనాల కేసులు కొంత వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైన్‌స్నాచింగ్‌లు గతంతో పోలిస్తే చాలావరకు తగ్గాయి. దొంగతనాల కేసుల్లో రికవరీ శాతం పెరగడం అభినందనీయం. పాలమూరు జిల్లాలో ఈ ఏడాది పగటివేళ 25, రాత్రివేళ 98 ఇండ్లల్లో దొంగతనాలు జరిగాయి. 2024లో 29.85 శాతం రికవరీ ఉండగా, ఈ ఏడాది 46.89 శాతానికి పెరిగింది. సీఈఐఆర్ యాప్ ద్వారా 1,173 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ 21 కేసుల్లో జైలుశిక్ష పడింది.
పెరుగుతున్న గంజాయి విక్రయాలు.. సైబర్ నేరాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం, సైబర్ నేరాల సంఖ్య పెరగడం దురదృష్టకరం. ఒక్క పాలమూరు జిల్లాలోనే 16 కేసుల్లో 1850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అడ్డాకులలో రూ.15 లక్షల విలువ గల ఆల్ర్పాజోలం పట్టుకున్నారు. సైబర్ నేరాల సంఖ్య గతేడాదితో పోలిస్తే వంద శాతం నేరాలు పెరిగాయి. సైబర్ నేరాల్లో రూ2.80 కోట్లు పోగొట్టుకోగా, రూ.1.98 కోట్లు రికవరీ చేశారు. పాలమూరు సమీపంలోని తువ్వగడ్డ తండాకు చెందిన ఏడుగురు సైబర్ నేరాలకు పాల్పడి దాదాపు రూ.3 కోట్లు ధన ఫైనాన్స్ యాప్ పేరుతో మోసం చేశారు.