Share News

రక్తమోడిన రైల్వే పట్టాలు

ABN , Publish Date - May 08 , 2025 | 11:21 PM

వేర్వేరు ఘటనలో రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరొకరికి రెండు కాళ్లు విరిగిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.

రక్తమోడిన రైల్వే పట్టాలు

వేర్వేరు ఘటనల్లో రైలు ఢీకొని ఇద్దరి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

గద్వాల సర్కిల్‌/ గద్వాలక్రైం, మే 8 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు ఘటనలో రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరొకరికి రెండు కాళ్లు విరిగిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టాలుదాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. గద్వాల రైల్వే పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ తెలిపిన కథనం మేరకు ఇలా ఉన్నాయి. వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన కృష్ణంనాయుడు (35) బుధవారం గద్వాల మండలం మేలచెర్వులో గ్రామంలో నిర్వహించిన గ్రామ దేవతల వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు. గురువారం తెల్లవారుజామున గ్రామ శివారు రైల్వే పట్టాల సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. పట్టాలుదాటుతున్న క్రమంలో రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురై కృష్ణంనాయుడు మృతిచెందినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ చెప్పారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

అనారోగ్యం తట్టుకోలేక..

జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఎరుకలి శ్రీను(22) గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. ఎరుకలి శ్రీను గద్వాల జిల్లా కేంద్రంలో ఎంఎల్‌టీ పూర్తిచేశాడు. ఆరు నెలల నుంచి తన ఆరోగ్యం బాగాలేదని, చనిపోతానని తన తల్లికి భారం కాకూడదనే చెబుతుండేవాడన్నారు. ఆ క్రమంలోనే గురువారం రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్యాయత్నం..

ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకునేందుకు రైలు కింద పడ్డాడు. లోకోపైలట్‌ అప్రమత్తం కావడంతో రెండు కాళ్లు తెగినా.. ప్రాణాలతో బయటపడ్డాడు. గద్వాల పురపరిధి చింతలపేటకు చెందిన గుడ్డెందొడ్డి గోపాల్‌ (62) అనారోగ్యంతో పాటు కుటుంబ సమస్యల కారణంగా గురువారం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. గద్వాల నుంచి పిలిగుండ్ల మీదుగా రాయచూర్‌కు వెళ్తున్న డెమో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్నాడు. లోకోపైలట్‌ గమనించి రైలును నిలిపి వేశాడు. అప్పటికే గోపాల్‌ రెండు కాళ్లపై రైలు వెళ్లడంతో తెగిపోయాయి. అపస్మారక స్థితిలో ఉన్న గోపాల్‌ను స్థానికుల సహాయంతో లోకోపైలట్‌ బయటకు తీశాడు. సమాచారం అందుకున్న గద్వాల రైల్వే పోలీసులు అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు కర్నూలు తీసుకెళ్లారు.

Updated Date - May 08 , 2025 | 11:21 PM