Share News

బ్లాక్‌ లిస్టు పండగ

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:32 PM

పౌరసరఫరాల వ్యవస్థలో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. జీవోల్లోని లొసుగులు.. నిబంధనలను ఎలా బైపాస్‌ చేయొచ్చో తెలిసిన అధికారుల చేతివాటం మూలంగా అక్రమాల కట్టడి అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఒక మార్గానికి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. మరో మార్గాన్ని సృష్టించుకుని యథేచ్ఛగా ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు.

బ్లాక్‌ లిస్టు పండగ

అధికారులకు కాసులు కురిపిస్తున్న బ్లాక్‌ లిస్టులో పెట్టిన రైస్‌ మిల్లులు

సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం

వాటికి ధాన్యం కేటాయించొద్దనే నిబంధనలు

కానీ డబ్బులు తీసుకొని కొన్నింటికి అప్పగిస్తున్న అధికారులు

బాయిల్డ్‌ మిల్లులకు చెక్కులను తీసుకొని కేటాయింపులు

సీఎంఆర్‌ అప్పగించిన మిల్లర్లకు మొండి చేయి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పౌరసరఫరాల వ్యవస్థలో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. జీవోల్లోని లొసుగులు.. నిబంధనలను ఎలా బైపాస్‌ చేయొచ్చో తెలిసిన అధికారుల చేతివాటం మూలంగా అక్రమాల కట్టడి అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఒక మార్గానికి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. మరో మార్గాన్ని సృష్టించుకుని యథేచ్ఛగా ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో జరుగుతున్న ధాన్యం కేటాయింపుల త తంగం చూస్తే అది నిజమనే అభిప్రాయం కలుగుతోంది. గతంలో రూపాయి పెట్టుబడి లేకుండా ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం మిల్లర్లకు కేటాయించేవారు. వారు ఆ ధాన్యాన్ని అమ్ముకుని.. ఏళ్లుగా సీఎంఆర్‌ పెండింగ్‌ పెడుతూ వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఆర్‌ఆర్‌ యాక్టు, 50 శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలనే పలు నిబంధనలు తెచ్చింది. ఏళ్లుగా సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉన్న మిల్లులను డిఫాల్ట్‌ లేదా బ్లాక్‌ లిస్టులోకి చేర్చింది. కేసులు ఉన్నా కూడా ధాన్యం కేటాయింపులు చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అధికారులు ఆ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ డిఫాల్ట్‌ లేదా బ్లాక్‌ లిస్టులో ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. కొందరు మిల్లర్లు నిత్యం అధికారులతో మంతనాలు చేసి.. బ్లాక్‌ లిస్టులో ఉన్న, కేసులు అయిన మిల్లులకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులకు అధిక మొత్తంలో డబ్బులు ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవో కారణాలు చూపుతూ, తమ కేటాయింపులు సరైనవిగా చూపించడంలో అధికారులు కూడా పలుమార్లు సఫలీకృతులు అవుతున్నారు. అవినీతిని కట్టడి చేయడానికి చేపట్టిన బ్లాక్‌ లిస్టు/డిఫాల్ట్‌ మిల్లులుగా గుర్తించడం అధికారులకు పండగలా మారింది.

8 మిల్లులకు కేటాయింపులు..

పౌరసరఫరాల శాఖ ఉత్తర్వుల ప్రకారం డిఫాల్ట్‌ లేదా బ్లాక్‌ లిస్టు లేదా 6ఏ ఆఫ్‌ ఈసీ చట్టం, రేషన్‌ రీసైక్లింగ్‌/ కొనుగోళ్ల కేసులు, ఫేక్‌ ట్రాక్‌ షీట్లు కలిగిన మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయొద్దు. అలాగే ఒక మిల్లుపై కేసు ఉంటే.. అతనికి చెందిన మరో మిల్లు ఉంటే దానికీ ధాన్యం కేటాయింపులు చేయకూడదు. కేసు ఉన్న సమయంలో వెరొకరికి లీజ్‌కు ఇచ్చి.. మేనేజ్‌మెంట్‌ మారినా ధాన్యం ఇవ్వకూడదు. సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉన్నా ఇవ్వకూడదు. ఎప్పుడైతే సీఎంఆర్‌ పూర్తిగా అప్పగించి, నో డ్యూ సర్టిఫికెట్‌ తీసుకుని, 50 శాతం బ్యాంకు గ్యారంటీలను ఇస్తే అప్పుడే కేటాయింపులు చేయాలి. ఇవన్నీ నిబంధనలు ఉన్నా అధికారులు బేఖాతరు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. డీపాల్ట్‌ లేదా కేసులు ఉన్న మిల్లుల్లో దాదాపు 8 మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేసినట్లు సమాచారం. పెబ్బేరు మండలంలోని ఓ మిల్లు సీఎంఆర్‌ అప్పగించకపోవడం, రెండు కోడ్లతో బురిడీ కొట్టించిన మిల్లర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టారు. కానీ అదే మిల్లర్‌కు చెంది, పేరు వేరే ఉందనే సాకు చూపి ధాన్యం కేటాయింపులు చేశారు. ఖిల్లాఘణపురం మండలం సోలిపూర్‌లోని ఒక మిల్లుపై కేసు పెండింగ్‌లో ఉంది. సదరు మిల్లుకు ధాన్యం కేటాయింపులు చేయడానికి లేదు. అయితే అదే మిల్లర్‌కు చెందిన మరో మిల్లుకు ధాన్యం కేటాయింపులు చేశారు. సదరు మిల్లర్‌ మిల్లర్ల అసోసియేషన్‌లో కీలక వ్యక్తి కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే ఆయన చుట్టూ ఉన్న మరికొందరు మిల్లర్లకు కూడా కేటాయింపులు చేసినట్లు సమాచారం. కానీ ఆ విషయాలు బయటకు పొక్కనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అనువు కాని చోట మరోలా..

పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు అందరికీ ఒకే విధంగా వర్తించాలి. తమ, పర బేధం ఉండకూడదు. కానీ అనువుగా ఉండి.. అమ్యామ్యాలు ముట్టిన మిల్లులకు ఒకలా, అనువు కానిచోట మరోలా అధికారుల శైలి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్‌ లిస్టులో ఉన్న మిల్లులకు పేరు వేరే అని చెప్పి కొందరికి కేటాయింపులు చేయడం కోసం లొసుగులను వాడుకుంటున్న అధికారులు.. సోలీపూర్‌ మిల్లులకు కేటాయింపులు చేశారు. అదే సమయంలో వనపర్తి పట్టణంలోని ఓ మిల్లుపై కేసు ఉండి బ్లాక్‌ లిస్టులో ఉంది. ఆయన వేరే మిల్లు నిర్మించుకుని దరఖాస్తు చేస్తే.. ఆయనకు మాత్రం కేటాయింపులు చేయడం లేదు. అలాగే పెండింగ్‌ సీఎంఆర్‌ ఉన్న బాయిల్డ్‌ మిల్లులకు కేటాయింపులు చేయవద్దు. కానీ ముందస్తు చెక్కులు తీసుకుంటున్నామని చెప్పి వాటికీ కేటాయింపులు చేస్తున్నారు. ఇదే నిబంధన అన్ని బాయిల్డ్‌ మిల్లులకు మాత్రం వర్తించడం లేదు. సీఎంఆర్‌ సరిగా అందించిన మిల్లర్లకు కూడా సాకులు చూపుతూ కేటాయింపులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చి.. అక్రమార్కులకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బ్లాక్‌ లిస్టు మిల్లులకు కేటాయించ లేదు

మా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బ్లాక్‌ లిస్టులో ఉన్న మిల్లులకు ఎలాంటి కేటాయింపులు చేయడం లేదు. క్రిమినల్‌ కేసులు బుక్‌ అయిన వాటికి కూడా ధాన్యం ఇవ్వడం లేదు. మంగళవారం సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం టెండర్‌ ధాన్యం పెండింగ్‌లో ఉన్న మిల్లులకు కూడా కేటాయింపులు చేయాలని చెప్పారు. అలాగే ధాన్యం బాగా వస్తున్న నేపథ్యంలో మిల్లుల కెపాసిటీకి డబుల్‌ ధాన్యం కేటాయింపులు చేయమన్నారు.

- వెంకటేశ్వర్లు, అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) వనపర్తి

Updated Date - Apr 29 , 2025 | 11:32 PM