నల్ల బారుతున్న.. తెల్లబంగారం
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:25 PM
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా తెల్ల బంగారం నల్లగా మారుతోంది. మే చివరి వారంలో ప్రారంభమైన వర్షాలు అక్టోబరు రెండో వారం గడుస్తున్నా వీడటం లేదు. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్, జూలై నెలల్లో పత్తి సాగును రైతాంగం చేపడుతుంది. ఆ సమయంలో కురిసే వర్షాలతో పత్తి ఏపుగా పెరిగి ఆగస్టు వరకు కాత దశకు చేరుకుంటుంది. సెప్టెంబరు రెండో వారం నుంచి పత్తి సేకరణ సీజన్ ప్రారంభమై డిసెంబరు నాటికి పూర్తవుతుంది.
వరి పంటను వేధిస్తున్న సూడి, కంకినల్లి, బ్లాస్లింగ్ తెగులు
మొక్కపైనే తడిసిపోతున్న పత్తి, మురిగిపోతున్న కాయలు
ఎకరాకు 2 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడికి మాత్రమే అవకాశం
కూలీ రేట్లు కూడా గిట్టుబాటు కావని ఆందోళనలో పత్తి రైతు
వరి పంటలో తెగుళ్లతో తాలుగా మారుతున్న ధాన్యం గింజలు
అధిక వర్షాల కారణంగానే వానాకాలం పంటలకు తీవ్ర నష్టం
మహబూబ్‌నగర్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా తెల్ల బంగారం నల్లగా మారుతోంది. మే చివరి వారంలో ప్రారంభమైన వర్షాలు అక్టోబరు రెండో వారం గడుస్తున్నా వీడటం లేదు. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్, జూలై నెలల్లో పత్తి సాగును రైతాంగం చేపడుతుంది. ఆ సమయంలో కురిసే వర్షాలతో పత్తి ఏపుగా పెరిగి ఆగస్టు వరకు కాత దశకు చేరుకుంటుంది. సెప్టెంబరు రెండో వారం నుంచి పత్తి సేకరణ సీజన్ ప్రారంభమై డిసెంబరు నాటికి పూర్తవుతుంది. రాష్ట్రంలో సాధారణం కంటే రెండు మూడు రెట్ల అధిక వర్షపాతం నమోదు కావడంతో వచ్చిన గూడ వచ్చినట్లు రాలిపోయింది. దీంతో దిగుబడి తక్కువవుతుందనే అంచనాలు సీజన్ మొదటి నుంచీ ఉన్నా యి. అయితే కా సిన కాయలు కూడా వర్షాల కారణంగా మొ క్కపైనే మురిగిపోతున్నాయి. మొదటి దశలో వచ్చిన కాయలు పగలడంతో వాటిని ఏరేందుకు కూడా వర్షం ఆగడం లేదు. పత్తి పూర్తిగా తడిసిపోయి నల్లగా మారుతోంది. కాయలు మురిగిపోతున్నాయి. తడిసిన పత్తిని తీయడానికి సాధారణం కంటే అధికంగా కూలీలు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పత్తి రైతులకు తీవ్ర నష్టాలు మిగులనున్నాయి. సెప్టెంబరు మూడు, నాలుగో వారం నుంచి తీసిన పత్తి నల్లగా ఉండటం, ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాల్సిన కొనుగోళ్లు జరగకపోవడంతో దళారులు కనిష్ఠంగా రూ. 3 వేలు, గరిష్ఠంగా రూ. 6 వేల వరకు పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ. 8110 కంటే చాలా తక్కువ. సగటున రూ. 4500 వరకు ధర పలుకుతోంది. కపాస్ కిసాన్ యాప్ నేపథ్యంలో ఇప్పటి వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత రావడం లేదు. ఓవైపు అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి మరోవైపు పత్తి నల్లగా మారడం, సీసీఐ కొనుగోళ్లు లేకపోవడంతో రాని ధర కలిపి పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
పెట్టుబడి ఖర్చులు రావడం కష్టమే..
రాష్ట్రంలో సుమారు 41 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగైంది. కొన్ని జిల్లాల్లో గతేడాది కంటే అదనంగా సాగు జరిగింది. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఈ ఏడాది 1.19 లక్షల ఎకరాల్లో అదనపు సాగు జరిగింది. ఎకరా పత్తిసాగుకు సుమారు రూ. 35,200 వరకు పెట్టుబడి అవుతుంది. కౌలు తీసుకున్న భూమి అయితే దీనికి మరో రూ. 12 వేలు అదనంగా అవుతుంది. దుక్కులు సిద్ధం చేయడానికి రూ. 6 వేలు, పత్తి విత్తనాలు 4 ప్యాకెట్లకు రూ. 3700, పంటకు మూడు దఫాలుగా ఎరువులు వేయడానికి రూ. 5500, అచ్చు వేయడం, గుంటుక తీసేందుకు రూ. 6 వేలు, కలుపు తీసేందుకు కూలి ఖర్చు రూ. 5500, క్రిమిసంహారక మందుల పిచికారీకి రూ. 8500 వరకు ఖర్చు వస్తుంది. మొత్తం కలిపి రూ. 35,200 కాగా.. కౌలుతో కలుపుకొని రూ. 47,200 వరకు ఖర్చవుతుంది. పత్తి సేకరణకు గుత్త పద్ధతిలో కిలోకు రూ. 15 నుంచి రూ. 20 వరకు, కూలీ పద్ధతిలో అయితే రూ. 350 నుంచి రూ. 500 వరకు పెట్టుబడికి అదనం. మొత్తం కలుపుకుంటే కనీస ఖర్చు రూ. 55 వేల పైమాటే. ఇంత చేస్తే సాధారణంగా 10 క్వింటాళ్ల వరకు సగటున దిగుబడి వచ్చే పత్తి ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 2 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్ల వరకు వచ్చే పరిస్థితి ఉంది. ధర తక్కువగా ఉంటే పెట్టుబడి ఖర్చులు కూడా రావడం కష్టమే. ఈ నేపథ్యంలో కొందరు రైతులు పత్తి తీయకుండా వదిలేద్దామా? అనే భావనలోకి వెళుతున్నారు. గద్వాల జిల్లాలోని అలంపూర్ ప్రాంతంలో కొన్నిచోట్ల గత నెలలోనే పత్తిని తొలగించి పొగాకు సాగును రైతులు చేపట్టారు.
వరిని వేధిస్తున్న తెగుళ్లు...
ఓ వైపు ఆరుతడి వ్యవసాయం చేసే రైతులను పత్తి దెబ్బతీస్తే సాగునీటి వనరులు ఉన్నచోట వరిని తెగుళ్లు పీడిస్తున్నాయి. అధిక వర్షాల కారణంగా కాండం కుళ్లు, సూడిదోమ, కంకినల్లి, బ్లాస్టింగ్ తెగుళ్లు తీవ్రంగా వస్తున్నాయి. దీని కారణంగా వరి పొట్ట దశలో ఉండగా గింజలు తాలుగా మారిపోతున్నాయి. కొన్నిచోట్ల పంట తెగులు సోకి పూర్తిగా చనిపోతోంది. దీనివల్ల ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు చివరి వారం వరకు పొంట పొలాలకు ఈ తరహా తెగుళ్లు సోకుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలోనే వర్షాలు కురుస్తుండటంతో నష్టం తీవ్రత కూడా పెరిగిపోతోంది. నవంబరు నుంచి చలి తీవ్రత తగ్గితే అప్పుడు తెగుళ్ల ప్రభావం తగ్గిపోతుంది. అయితే అప్పటికే మెజారిటీ వరి కోతకు వస్తుంది. దీంతో వరి రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం ఇన్‌పుడ్ సబ్సిడీ కింద పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే పెట్టుబడి డబ్బుల కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతామని వాపోతున్నారు.
పెట్టుబడి ఎక్కువవుతోంది : ఎల్లన్న, రైతు, మూలమల్ల, వనపర్తి జిల్లా
వర్షాకాలం ముందుగానే ప్రారంభం కావడంతో పంట ముందుగానే చేతికి వస్తుందని ఆనందపడితే తెగుళ్లు పంటలను ఆశించి నాశనం చేస్తున్నాయి. మాది వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల. నాకు ఉన్న పొలంతో పాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకొని జూరాల నీటి ఆధారంగా జూలైలో నాట్లు వేశాను. వరి కంకి పొట్ట దశకు వచ్చే సరికి సుడి దోమ, కంకినల్లి, బ్లాస్టింగ్ తెగుళ్లు ఆశించాయి. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పిచికారి మందులు కొడుతున్నా తెగులు ఉధృతి తగ్గడం లేదు. దీంతో గతేడాది పోలిస్తే ఈ ఏడాది రూ. 10 వేల వరకు అదనంగా పెట్టుబడి అయ్యింది. అయినా దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది.