బిర్యానీ పాషా.. చోరీల్లో బాద్షా
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:11 PM
అతడో ఘరానాదొంగ. తాళం వేసిన ఇల్లు కనపడితే కన్నం వేసి అందినకాడికి దోచుకెళతాడు.
- ఘరానాదొంగ ఆటకట్టించిన పోలీసులు
- 7 కిలోల వెండి, 43 గ్రాముల బంగారం రికవ రీ
- 10 కేసుల్లో నిందితుడు, గతంలో 40 కేసులు
- వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : అతడో ఘరానాదొంగ. తాళం వేసిన ఇల్లు కనపడితే కన్నం వేసి అందినకాడికి దోచుకెళతాడు. బిర్యానీ పెడితే, అది తినేలోపు చేసిన దొంగతనాలన్నీ వరుస పెట్టి చెబుతాడు. అతడే మహబూబ్ పాషా, అలియాస్ బిర్యానీ పాషా. పలు దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కిన అతడి వద్ద వెండి కొండనే దొరికింది. ఏకంగా 7 కిలోల వెండి వస్తువులు, 43 గ్రాముల బంగారు నగలు లభించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ్లఎస్పీ జానకి వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన మహమూద్ పాషా అలియాస్ బిర్యానీ పాషా ఒకవైపు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ మరోవైపు దొంగతనాలు చేస్తున్నాడు. కొద్దిరోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత నెల 29న బాలాజీనగర్‌లో మాచన్‌పల్లి రాజేశ్వర్‌రెడ్డి నివాసంలో దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో 4 కిలోల వెండి నగలు, రూ. 20 వేల నగదు అపహరణకు గురయ్యింది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా క్లూ లభించింది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మంగళవారం రామయ్యబౌళి ట్యాంక్‌బండ్ వద్ద ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వన్‌టౌన్ సీఐ అప్పయ్య, సీసీఎస్ సీఐ రత్నం కారు వద్దకు వెళ్లారు. అందులో ఉన్న మహబూబ్‌పాషా వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. కారులో సోదా చేయగా వెండి వస్తువులు కనిపించాయి. వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే అతడు పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా మహబూబ్‌నగర్ రూరల్ పరిధిలో 5, వన్‌టౌన్ పరిధిలో 1, టుటౌన్ పరిధిలో 2, దేవరకద్ర పరిధిలో 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. అతడి నుంచి 7 కిలోల వెండి వస్తువులు, 43 గ్రాముల బంగారు నగలు, రూ. 26,600 నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బిర్యానీ అంటే మహా ఇష్టం
నిందితుడు మహబూబ్ పాషాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ ముందు పెట్టి విచారిస్తే అది పూర్తయ్యే లోపు చేసిన దొంగతనాలన్నీంటినీ ఒప్పేసుకుంటాడు. గతంలో అతడిపై 40 దొంగతనం కేసులు ఉన్నాయి. ఓ రోడ్డు ప్రమాదంలో అతడి కాలు ఫ్యాక్చర్ కావడంతో చోరీలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. ఇటీవలే కోలుకొని మళ్ళీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ పరిధిలో 10 కేసులు చేశాడు. తాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకొని, రాత్రి దొంగతనం చేసి ఉదయం పూట విక్రయించేస్తాడు. అతడికి ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలున్నాయి. కేసులో కీలకంగా పనిచేసిన వన్‌టౌన్ సీఐ అప్పయ్య, సీసీఎస్ సీఐ రత్నం, ఫింగర్‌ప్రింట్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐలు శీనయ్య, చంద్రమోహన్, రమేశ్, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్ళు శేఖర్, పవన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్‌లను ఎస్పీ అభినందించారు.