Share News

బిల్లులు వస్తున్నా.. గ్రౌండింగ్‌ సగమే!

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:15 PM

పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.

 బిల్లులు వస్తున్నా.. గ్రౌండింగ్‌ సగమే!
హన్వాడ మండలం నాయినోనిపల్లిలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు

- ఇంటి నిర్మాణానికి ముందుకురాని ఇందిరమ్మ లబ్ధిదారులు

- ప్రభుత్వ ఆర్థిక సాయానికి మరికొంత జోడించలేక వెనుకంజ

- ప్రతీ సోమవారం ఠంచనుగా లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు

- గ్రౌండింగ్‌ చేసినా మార్కింగ్‌ దశలోనే నిలిచిపోతున్న దుస్థితి

- గ్రౌండింగ్‌ కాని వాటిని ఇతరులకు బదిలీ చేయాలనే డిమాండ్‌

-ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 40,306 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

మహబూబ్‌నగర్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. మొదటి విడత కింద మంజూరైన ఇళ్లలో సగంపైగా లబ్ధిదారులు గ్రౌండింగ్‌ చేసుకోవ డం లేదు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతీ పేదకు మంజూరు చేస్తామని, అందుకు రూ. 5లక్షల వరకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం ప్రారంభించి.. అభయహస్తం ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేసింది. ఆ తర్వాత సామాజి క, ఆర్థిక, కుల, రాజకీయ సర్వేలో కూడా వివరాలు సేకరించింది. మొదటి విడతగా సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను మంజూరు చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 40,306 ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేసింది. నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రతీ సంవత్సరం మంజూరు చేస్తామని చెప్పగా.. మొదటి విడతలో మం జూరు చేసిన ఇళ్ల నిర్మాణాలే కొనసాగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి అందిస్తున్న ఆర్థికసా యం సరిపోకపోవడం, అందుకు కొంత లబ్ధిదారుడు జోడించాల్సి వ స్తుండటంతో వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముందుకు రావ డం లేదనేది స్పష్టమవుతోంది. అలాగే ఇంటి నిర్మాణ సామగ్రి ధర లు పెరగడం, ఇసుక కొరత, బయట దొరికినా ఎక్కువ ధరలు ఉండటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. అలాగే గ్రౌండింగ్‌ కాకుండా 45శాతం వరకు పెండింగ్‌ ఉండగా.. గ్రౌండింగ్‌ చేసి మార్కింగ్‌ చేసిన వాటిలో కూడా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇలా ఇంటి నిర్మాణానికి ముందుకురాని లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచిచూడాలి. కొంత గడువు విధించి వాటిని రెండో జాబితాకు మళ్లించడమా? అనేది పునరాలోచించాల్సి ఉంటుంది.

ఠంచనుగా బిల్లులు..

వాస్తవానికి ఏ ప్రభుత్వ పథకమైనా.. నిర్మాణమైనా బిల్లులు రావాలంటే చాలా సమయం పడుతుంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇంకా సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రాధాన్య పథకంగా తీసుకుని ప్రతీ సోమవారం ఇంటి నిర్మాణ స్థాయిలను బట్టి బిల్లులు మంజూరు చేస్తుంది. ఎక్కువ మొత్తంలో పెండింగ్‌ కూడా ఉండటం లేదు. అయినప్పటికీ ఇళ్ల నిర్మాణానికి చాలామంది ముందుకు రావడం లేదు. అయితే బిల్లుల విషయాల్లో ఉన్న భయాలను అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంత టంఛనుగా బిల్లులు వస్తున్నా.. లబ్ధిదారులకు తెలియకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

నారాయణపేట జిల్లాలో ఇప్పటివరకు 4703 ఇళ్లు గ్రౌండింగ్‌ కాగా.. ఇప్పటివరకు రూ. 41 కోట్ల బిల్లులు మంజూరయ్యాయి. ప్రస్తుత నిర్మాణ స్థాయిని బట్టి 200 ఇళ్లకు రూ. 4 కోట్లు బిల్లు సోమవారం జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. గద్వాల జిల్లాలో ఇప్పటివరకు రూ. 45.25 కోట్లు మంజూరు కాగా.. రూ. 82లక్షలు మాత్రమే పెండింగ్‌ ఉంది. అవి కూడా సోమవారం విడుదల కానున్నాయి. వనపర్తి జిల్లాలో రూ. 71.70 కోట్లు మంజూరయ్యాయి. 43 ఇళ్లకు సంబంధించి రూ. 43 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ. 92 కోట్లు ఇప్పటివరకు మంజూరు కాగా.. ప్రస్తుతం ఎలాంటి పెండింగ్‌ బకాయిలు లేవు. ప్రతీ సోమవారం పేమెంట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పవచ్చు.

ఈ స్థాయిలో ఇలా..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు మొదటి విడతగా 40,306 ఇళ్లు మంజూరు కాగా.. ఇందులో 27,375 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయి. వాటిలో మార్కింగ్‌ చేసిన ఇళ్లు 4310 కాగా.. అవి ఆ దశలోనే ఆగిపోయాయి. మార్కింగ్‌ చేసుకున్న తర్వాత వాటి నిర్మాణం కొనసాగడం లేదు. అలాగే బేస్‌మెంట్‌ లెవల్‌లో 14,459 ఇళ్లు ఉండగా.. రూప్‌ లెవల్‌లో 4992 ఇళ్లు, స్లాబ్‌ లెవల్‌లో 3566 ఇళ్లు, దాదాపు 48 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో ఎక్కువ ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకుంటుండగా.. మిగతా జిల్లాల్లో కొంత మందకొడిగా సాగుతోంది. ఇళ్ల గ్రౌండింగ్‌ విషయంలో మాత్రం అన్ని జిల్లాలు ఒకే తరహాలో ఉన్నాయి. 50 నుంచి 55శాతం వరకు మాత్రమే గ్రౌండింగ్‌ అవుతున్నాయి. అయితే మార్కింగ్‌ తీసుకోకుండా.. గ్రౌండింగ్‌ కాని ఇళ్లను లబ్ధిదారులకు సంబంధించి రెండో జాబితాలో ఉన్న లబ్ధిదారులకు కేటాయిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఇళ్లు చిన్నగా అవుతుందని, నిబంధనలు పాటించకపోతే బిల్లులు రావనే అనుమానాలు నివృత్తి చేసి.. అధికారులు ప్రోత్సహిస్తే వారికీ మేలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అనివార్య కారణాల వల్ల కట్టలేకపోతున్నాను

ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇందిర మ్మ ఇల్లు మంజూరు చేసింది. కా నీ నా సొంత అవసరాల నిమిత్తం ఇం టి పనులు ఇంకా ప్రారంభించలేదు. అధి కారులు, నాయకులు పూర్తి మద్దతు ఇస్తు న్నా కట్టడం లేదు. ఆర్థిక ఇబ్బం దులు ఉండటంతో సమయం ఇవ్వాలని కోరుతున్నా.

- నర్సింహులు, నవాబ్‌పేట

Updated Date - Nov 15 , 2025 | 11:15 PM