3 నుంచి భూభారతి సదస్సులు
ABN , Publish Date - May 30 , 2025 | 11:39 PM
జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు భూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
- తహసీల్దార్లు, డీటీలు, ఆర్.ఐలకు అవగాహన సదస్సులో కలెక్టర్
- జూన్ 20 వరకు నిర్వహణ
గద్వాల న్యూటౌన్, మే 30 (ఆంధ్రజ్యోతి): జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు భూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో భూ భారతి రెవిన్యూ సదస్సులపై తహసిల్దార్లు, డీటీలు, ఆర్.ఐలకు అవగాహన సదస్సును ను నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ధరణి స్ధానంలో భూ భారతి చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్‌వోఆర్ మార్పులు-చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్‌సీ వంటి సేవలు సులభతరం అవుతుందన్నారు. జిల్లాలో ఇటిక్యాల మండలంలో భూ భారతి పైలేట్ ప్రాజెక్టుగా విజయవంతంగా నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. జూన్ 3 నుంచి 30 వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ భారతి కార్యక్రమంలో పాల్గొనే అధికారులందరికీ చట్టాలు, నిబంధనలు, షెడ్యూల్ విషయాల్లో పూర్తి అవగాహన ఉండాలన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తహసీల్దార్లు గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందించి పంపాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుకు మండలం నుంచి రెండు బృందాలు ఏర్పాటు చేసుకొని రోజుకు ఒక గ్రామాన్ని సందర్శించి ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామంలోనే ఉండి ప్రజల భూ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్ భూములు ఉంటే వాటిని గుర్తించి తక్షణమే పైఅధికారుల దృష్టికి తేవాలన్నారు. వాటిని సి.సి.ఎల్.ఏ కు పంపిస్తామన్నారు. జూన్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించి ఆగస్టు 14కు ముందుగా అన్ని దరఖాస్తులు పరిష్కరిం చాలన్నారు. ప్రతీ రోజు సదస్సు పూర్తయ్యాక వచ్చిన దరఖాస్తులను డిజిటల్ రూపంలో నమోదు చేయాలన్నారు. భూ భారతి చట్టంతో తహసీల్దార్ స్థాయి నుంచే అప్పీల్‌కు అవకాశం ఉండటం వల్ల భూసమస్యలు త్వరగా పరిష్కరమవుతాయని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్.ఐలు ఉన్నారు.