భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి
ABN , Publish Date - May 05 , 2025 | 11:28 PM
రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
కలెక్టర్ విజయేందిర బోయి
మూసాపేట మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు
మూసాపేట, మే 5(ఆంధ్రజ్యోతి): రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. భూ భారతిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మూసాపేట మండలంలోని చక్రాపూర్, తుంకినీపూర్ సోమవారం రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. రైతులు తమ భూముల సమస్యల పరిష్కారానికి దరకాస్తు చేసుకోవాలని చెప్పారు. అధికారులు రికార్డులను పరిశీలించి, పరిష్కరిస్తారని అన్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులో భూ రికార్డుల్లోని పేర్ల తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూస్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ ములు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టాపాసు పుస్తకాలు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బీలో చేర్చిన భూములు, భూసేకరణ తదితర సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. భూ భారతి చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి, నిర్దేశిత గడువులో పరిష్కరిస్తారని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమం పరిశీలన..
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చక్రపూర్‌లో చేపట్టిన ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమాన్ని కలెక్టర్ విజయేందిరబోయి పరిశీలించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ కలెక్టర్‌కు వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల వివరాలను యాప్‌లో నమోదు చేస్తారన్నారు. ప్రతీ రైతుకు 14 అంకెల విశిష్ట సంఖ్య కేటాయిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీవో నవీన్, తహసీల్దార్ రాజు, డీటీ శ్రీనివాసులు, ఏవో అనీల్‌కుమార్ పాల్గొన్నారు.