Share News

భూ భారతి పైలట్‌ మండలాలే రాష్ట్రానికి దిక్సూచి

ABN , Publish Date - May 15 , 2025 | 11:09 PM

భూభారతి ఎంతో సులభతరమైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు పైలట్‌ మండలాల్లో జిల్లాలోని మద్దూర్‌ మం డలం ఒకటని, ఈ పైలట్‌ మండలంలో భూ సమస్యలకు చూపించిన పరిష్కారం అన్ని మండలాలకు వర్తిస్తూ రాష్ట్రానికే దిక్సూచి అని చెప్పారు.

భూ భారతి పైలట్‌ మండలాలే రాష్ట్రానికి దిక్సూచి
మెడికల్‌ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు

నారాయణపేట/నారాయణపేట టౌన్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : భూభారతి ఎంతో సులభతరమైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు పైలట్‌ మండలాల్లో జిల్లాలోని మద్దూర్‌ మం డలం ఒకటని, ఈ పైలట్‌ మండలంలో భూ సమస్యలకు చూపించిన పరిష్కారం అన్ని మండలాలకు వర్తిస్తూ రాష్ట్రానికే దిక్సూచి అని చెప్పారు. గురువారం నారాయణపేట జిల్లా పర్యటనకు తొలిసారిగా వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, కాడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేశారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సమయంలో నెలకు రూ. ఆరువేల కోట్లు ఖర్చు అయ్యేవని, ఇప్పుడు ఖర్చు రూ. 23 వేల కోట్లకు పెరిగిందన్నారు. జిల్లాలు పెరిగాయని, ప్రజల అంచనాలు కూడా పెరిగాయన్నారు. నారాయణపేట జిల్లా చివర్లో వచ్చిందని, సీఎం జిల్లా కావడంతో కలిసి వస్తుందన్నారు. చేసింది బాగుందని, చేయాల్సింది చాలా ఉందన్నారు. 3.50 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 3.50 లక్షల మంది అంటే జనాభాలో ఒక శాతమే ప్రభుత్వ అధికారులం ఉన్నామని, ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ పఽథకాలను అమలు చేస్తూ మరో వైపు అవసరమైన పనులు కొనసాగించి బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే పరిష్కారం కానివి అని నిర్ధారించి తిరస్కరించాలని సీఎస్‌ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పఽథకంలో అర్హుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. నూతన కలెక్టరేట్‌ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలన్నారు. జిల్లాలో రబీ, ఖరీఫ్‌ వరిసాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌ పాఠశాలల్లో విద్యా బోధనను పరిశీలిస్తే మనం ఏంచేయాలో తెలుస్తుందన్నారు. కాడ అభివృద్ధి పనులపై శాఖల వారీగా చర్చించారు. పలు సంక్షేమ పథకాలు, శాఖల ప్రగతి పనుల పురోగతికి సీఎస్‌ సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతకు ముంది ఆయా శాఖల నివేదికల వివరాలను సీఎ్‌సకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

మెడికల్‌ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి

అంతకు ముందు సీఎస్‌ కళాశాలలో మెడికల్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థులతో సీఎస్‌ మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాను 1996లో పని చేశారని తెలిపారు. జిల్లాకు వెనుకబడిన జిల్లాగా పేరు ఉండేదని గుర్తు చేశారు. కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని సూచించారు. అనంతరం కళాశాల కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లతో కళాశాల నిర్వహణ, సౌకర్యాల గురించి చర్చించారు. తర్వాత సింగారం మలుపు వద్ద జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ను పరిశీలించారు. అందులో పని చేస్తున్న మహిళా సిబ్బందితో మాట్లాడారు.

Updated Date - May 15 , 2025 | 11:09 PM