Share News

‘భారత్‌మాల’ రోడ్డు పనుల అడ్డగింత

ABN , Publish Date - May 27 , 2025 | 11:15 PM

భారత్‌ మాల జాతీయ రహదారి నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి అవుతున్నా పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘భారత్‌మాల’ రోడ్డు పనుల అడ్డగింత
గంగిమాన్‌దొడ్డి దగ్గర నిర్మాణం అవుతున్న భారత్‌మాల రహాదారిపై అందోళన చేపడుతున్న రైతులు

- పరిహారం చెల్లించాలంటూ రైతుల ఆందోళన

- సైట్‌ ఇన్‌చార్జి హామీతో విరమణ

గట్టు, మే 27 (ఆంధ్రజ్యోతి) : భారత్‌ మాల జాతీయ రహదారి నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి అవుతున్నా పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన భూములకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, గంగిమాన్‌దొడ్డి రైతులు మంగళవారం రహదారి నిర్మాణ పనులను అడ్డుకొని రాస్తారోకో చేపట్టారు. పరిహారం చెల్లింపులో జాప్యంపై సైట్‌ఇన్‌చార్జి అఫ్జల్‌ను నిలదీశారు. తమకు న్యాయం జరిగే వరకు పనులను జరుగనిచ్చేది లేదంటూ వాగ్వాదానికి దిగారు. పరిహారం విషయంపై కలెక్టర్‌ను కలుద్దామని, తాను కూడా వస్తానని రైతులకు నచ్చచెప్పినా రైతులు ఆందోళన విరమించలేదు. కచ్చితమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని పట్టుబట్టారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. చివరకు సైట్‌ఇన్‌చార్జి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతుల అందోళనకు బీఅర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు.

Updated Date - May 27 , 2025 | 11:16 PM