విద్యార్థులకు మెరుగైన వైద్యం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:23 PM
అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
- బాధ్యులను సస్పెండ్ చేస్తాం : కలెక్టర్
- వసతి గృహ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా
గద్వాల న్యూటౌన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటి క్యాల మండలంలోని ధర్మవరం బీసీ బాలుర సంక్షేమ వసతిగృహంలో శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం కలెక్టర్ పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహ విద్యార్థులు అందరూ శుక్రవా రం రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులు రావడంతో విద్యార్థులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 55 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం 33 మంది విద్యార్థులను శనివారం ఉదయం డిశ్చార్జి చేశారు. మిగిలిన 22 మంది విద్యార్థుల ఆరోగ్యపరిస్ధితిని బట్టి డిశ్చార్జి చేయిస్తామన్నారు. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా చూస్తామని విద్యా ర్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. వసతి గృహంలో మొత్తం 140 మంది విద్యార్థులకు గాను 110 మంది ఉన్నారని తెలిపారు. క్యాబేజీ, కాలిఫ్లవర్ కలిపి వండటంతో ఈ ఆహారం పడని 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అంతే కాకుం డా ఉడకబెట్టిన గుడ్డు తినడం కూడా కారణమని ఆరోపణలు వస్తుండటంతో శ్యాంపిల్స్‌ను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపిస్తామన్నారు. ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేస్తామని తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర, గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.