వరుస దొంగతనాలతో బెంబేలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:05 PM
వరుస దొంగతనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఇంటికి తాళం వేయాలంటేనే భయపడాల్సి వస్తోంది..
- పట్టపగలే చోరీలు
- పనిచేయని సీసీ కెమెరాలు
చిన్నచింతకుంట, జూలై 13 (ఆంధ్రజ్యోతి) :వరుస దొంగతనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఇంటికి తాళం వేయాలంటేనే భయపడాల్సి వస్తోంది.. పెళ్ళిళ్లు.. పేరంటాలకు ఇంటికి తాళం వేస్తే వెళ్తే.. వచ్చే సరికి ఇంటిని గుళ్ల చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.. సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో వారి పని మరింత సులువవుతుంది. మరొకొన్ని చోట్ల ఇంట్లో జనం ఉండగానే పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నెల 7న ఉంద్యాల గ్రామంలో సాయంత్రం అహ్మద్‌అక్రమ్ అతని తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బీరువాలో ఉన్న 4 తులాల బంగారు నగలతో పాటు ఇతర వస్తువులు దోచుకెళ్లారు. వీటి విలువ రూ.3.30 లక్షల వరకు ఉంటుందని బాధితులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈనెల 10న సీసీకుంట మండల కేంద్రంలో ఉంద్యాల సాయమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన మహిళ ఇంట్లోకి వెళ్లి సాయమ్మ కంట్లో కారం కొట్టి మెడలో ఉన్న 4 తులాల పుస్తెల తాడు లాక్కెళ్లింది. గతనెల 19న కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో కాల్వ కన్నయ్య అనే వ్యక్తికి అగంతకుల నుంచి ఫోన్ వచ్చింది. మీ ఆధార్ దుర్వినియోగం అయ్యాందని, వెంటనే మీ అకౌంట్‌లో డబ్బులు వేయాలంటూ సైబర్ నేరగాడు రూ.18 లక్షలు కాజేశాడు. ఈ ఘటనలన్నీ మండలంలో కలకలం రేపుతున్నాయి. గ్రామాల్లో పోలీస్ పెట్రోలింగ్ మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలకు దొంగతనాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
పనిచేయని సీసీ కెమెరాలు
నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్‌శాఖ పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. ప్రజల సహకారంతోనే కొన్ని చోట్ల కెమెరాలను ఏర్పాటు చేయించారు. కెమెరాలుంటే దొంగతనాలతో పాటు చాలా రకాల నేరాలను కట్టడి చేయవచ్చు. అయితే చాలా రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలకు దొంగతనం చేయడం మరింత సులవవుతుంది. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరుపయోగంగా మారడం నేరాలు పెరిగేలా చేస్తుంది. పోలీసులు ఇప్పటికైనా స్పందించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడంతో పాటు అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలి.