Share News

బీసీ గెలుపు.. 44.22 శాతం!

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:45 PM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది.

బీసీ గెలుపు.. 44.22 శాతం!

- జనరల్‌ స్థానాల్లోనూ ఆ అభ్యర్థుల విజయం

- 1,671 స్థానాల్లో ఎన్నికలు, బీసీలకు 365 రిజర్వు

- జనరల్‌ 374తో కలిపి.. 739 పంచాయతీలు వారివే..

- గణనీయంగా తగ్గిన అగ్ర కులాల ప్రభావం

- ఎస్సీ, ఎస్టీలు కూడా పలుచోట్ల జనరల్‌ స్థానాల్లో గెలిచిన వైనం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో చట్టం చేయడంతో పాటు.. అర్డినెన్స్‌ను సిద్ధం చేసింది. ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేసి.. ఎన్నికల సంఘానికి సమర్పించడంతో షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఈ విషయంపై పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఆ రిజర్వేషన్లను రద్దు చేసి 50 శాతం రిజర్వేషన్లతోనే వెళ్లాలని సూచించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. ముందస్తుగా పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.

పెరిగిన బీసీల ప్రభావం

పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేకపోయినప్పటికీ.. గ్రామాల్లో పార్టీల మద్దతుదారులే విజయం సాధిస్తారు. పోరు కూడా అదే విధంగా ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల ముందు హడావిడి నెలకొనగా.. గత పంచాయతీ ఎన్నికల్లోనూ.. ప్రస్తుత ఎన్నికల్లోనూ బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రజలు పట్టం కట్టారు. గతం కంటే ఎక్కువగా ఈసారి బీసీలకు సీట్లు దక్కాయని చెప్పవచ్చు. పార్టీలు కూడా అందుకు అనుగుణంగా తమ మద్దతుదారులను సిద్ధం చేశాయి. అయితే స్థానిక సంస్థల్లో గతంలో నుంచి కూడా బీసీల ప్రభావం పెరుగుతూ వస్తోంది. చట్టసభల్లో రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య ప్రధాన పోటీ జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంలో మక్తల్‌ నియోజకవర్గంలో పర్యటించడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు శక్తివంచన లేకుండా కాలికి బలపం కట్టుకున్నట్లు తిరిగారు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. పోటీ చేసిన వారిలో కూడా మెజారిటీ బీసీలే ఉండటం గమనార్హం.

గతం కంటే ఎక్కువే!

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2019 పంచాయతీ ఎన్నికల్లో 1,690 జీపీలు ఉండగా, బీసీలకు 406 రిజర్వేషన్‌ చేయగా.. జనరల్‌ స్థానాల్లో బీసీలు 238 చోట్ల గెలిచారు. మొత్తం 644 పంచాయతీలు ఆ సమయంలో బీసీలకు దక్కాయి. మొత్తంగా 38.10 శాతం జీపీల్లో బీసీలు సర్పంచులు అయ్యారు. ఈసారి బీసీ నినాదం విస్తరించడంతో గతం కంటే ఎక్కువ సీట్లు దక్కాయి. మొత్తం 1,678 జీపీలకు గాను 1,671 జీపీల్లో ఎన్నికలు నిర్వహించారు. అందులో బీసీలకు 365 స్థానాలు కేటాయించారు. జనరల్‌ స్థానాల్లో 374 సీట్లను బీసీలు అదనంగా గెలుచుకోవడంతో మొత్తం 739 గ్రామాలు బీసీలకు దక్కాయి. గత పంచాయతీ ఎన్నికల కంటే 95 సీట్లలో అదనపు బలం చేకూరిందని చెప్పవచ్చు. అంటే దాదాపు 44.22 శాతం వాటా బీసీలకు దక్కింది. వాస్తవానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్‌కర్నూలును మినహాయిస్తే అన్ని జిల్లాల్లో ఎక్కువగానే సీట్లు దక్కాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఉండటంతో మూడో విడతలో బీసీలకు కేవలం 9 సీట్లు మాత్రమే రిజర్వు చేశారు. దీనివల్ల నాగర్‌కర్నూలులో బీసీలు 26.65 శాతం వాటా మాత్రమే దక్కించుకున్నారు. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 58.43 శాతం సీట్లను బీసీలు దక్కించుకున్నారు. ఆ తర్వాత నారాయణపేటలో 54.77 శాతం, వనపర్తిలో 47.38శాతం, మహబూబ్‌నగర్‌లో 45.73 శాతం సీట్లను బీసీలు గెలుచుకున్నారు.

మారిన పరిస్థితి

గతంలో జనరల్‌ స్థానాల్లో పోటీ చేయాలంటే బీసీలు భయపడేవారు.. అందుకు ముఖ్య కారణం గ్రామాల్లో ఓసీ అభ్యర్థులకు ఉండే పలుకుబడి, డబ్బు, వారి మాట చెల్లుబాటు అవుతుందనే నమ్మకం కారణంగా బీసీలు పోటీపడేవారు కాదు.. కానీ రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకోవడం, బీసీ నేతలు ఆ వ్యాపారంలో రాణిస్తుండటం, రాజకీయ చైతన్యంతో పాటు అధికార వ్యవస్థలపై అవగాహన పెరగడం, ఊర్లలో ఉండే ఏక, ద్విసామ్యానికి చెక్‌ పెట్టాలనే ఉద్దేశం రావడంతో బీసీలు ఎక్కువగా బరిలోకి దిగుతున్నారు. అలాగే చైతన్యంతో పాటు బీసీల్లో చదువుకున్న వారి సంఖ్య కూడా పెరగడం దీనికి కారణంగా చెప్పవచ్చు. అటు ఖర్చుకు వెనుకాడని పరిస్థితులు రావడం, ఇటు విద్యాపరంగా ముందంజలో ఉండటం, అవగాహన కలుగడంతో బీసీల ప్రభావం పెరుగుతోందని చెప్పవచ్చు. అయితే గ్రామాల్లో ఉన్న ఆత్మవిశ్వాసం మండల, జిల్లా స్థాయికి వచ్చేసరికి తగ్గిపోతోందనే అభిప్రాయం కూడా ఉంది. ఉన్నత పదవుల్లో ఇప్పటికీ ఓసీలు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థాయిలో కూడా కొన్నిచోట్ల జనరల్‌ స్థానాల్లో బీసీలు గెలుస్తున్నప్పటికీ.. పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలతో పోలిస్తే కొంత తక్కువనే చెప్పాలి. ఇక శాసనసభ విషయానికి వస్తే మరింత తగ్గుతోంది. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:45 PM