రంగనాయకస్వామి గుట్టపై ‘అవంతిక-2’ షూటింగ్
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:20 PM
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని రంగనాయకస్వామి గుట్టపై శుక్రవారం ‘అవంతిక-2’ షూటింగ్ సందడి మొదలయ్యింది.
- క్లాప్ కొట్టి ప్రారంభించిన మాజీ మంత్రి
జడ్చర్ల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని రంగనాయకస్వామి గుట్టపై శుక్రవారం ‘అవంతిక-2’ షూటింగ్ సందడి మొదలయ్యింది. కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హీరో, దర్శకుడు శ్రీరాజ్‌భల్లా, హీరోయిన్ గీతాంజలిలతో కలిసి రంగనాయకస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయం ముందు ముహూర్తం షాట్‌కు మాజీ మంత్రి క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ స్పాట్‌లు అనేకం ఉన్నాయన్నారు. అవంతిక చిత్రబృందం గతంలోనూ ఇక్కడ సినిమా షూటింగ్ చేసిందని తెలిపారు. హీరో, హీరోయిన్లు, జడ్చర్ల వాస్తవ్యుడు, క్రియేటివ్ డైరెక్టర్ ఫణిరాజ్‌గౌడ్‌లు మాట్లాడుతూ కామెడీ హర్రర్ జోనర్‌లో సినిమా ఉంటుందని తెలిపారు. జడ్చర్ల కళాకారులను ప్రోత్సహించేందుకు త్వరలోనే ఆడిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి తమ సినిమాలో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ నటి అనురాధచౌదరి, కెమెరామెన్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ, నటులు దేవరాజ్, కార్తికేయ, రమణాచార్యులు పాల్గొన్నారు. సినిమా బృందానికి శ్రీరంగనాయకస్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాల్వ రాంరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.