కలెక్టరేట్‌లో పురుగులమందు తాగేందుకు యత్నం
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:41 PM
తమ పొలంలోకి ఇతరులు దౌర్జన్యంగా వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని
- మా పొలంలోకి ఇతరులు వస్తున్నారని బాధితుల ఆందోళన
గద్వాల క్రైం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : తమ పొలంలోకి ఇతరులు దౌర్జన్యంగా వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో కలెక్టరేట్ ముందు ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేందుకు ప్రయత్నించింది. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అయిజ మండల పరిధిలోని ఉప్పలకు చెందిన చాకలి రాములు, సావిత్రమ్మ దంపతులకు సర్వే నెం. 150లో 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అయితే రాములు, సోమన్నలు అనే అన్నదమ్ములకు సర్వే.నెం. 195లో భూమి ఉన్నదని, ఇద్దరు అన్నదమ్ములు ఇంతకుముందే నాలుగు ఎకరాల చొప్పున 8 ఎకరాల భూమిని పంచుకు న్నారు. సోమన్నకు సంబంధించిన 4 ఎకరాల భూమిలో కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉన్నదని, మిగిలిన రెండు ఎకరాలు సర్వే. నెం. 150లో ఉన్నదని, తన భూ మిని తనకు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని గతంలోనే చాకలి రాములు, సావిత్రమ్మలు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సర్వే నెంబర్‌లో ఉన్న భూమి తమ సర్వే నెంబర్‌లో ఎలా ఉంటుందని, పదేపదే చెప్పినా వారు వినడంలేదన్నారు. ఈ విషయంలో అధికారులు వారికే మద్దతు తెలుపుతున్నారని బాధితులు ఆరోపిం చారు. ఇక చేసేది లేక సోమవారం కలెక్టర్ ముందు పురుగులమందు తాగి ఆత్మహత్యకు సావిత్రమ్మ ప్రయత్నిస్తుండగా గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే సీసాలోని పురుగుమందును స్వాధీనం చేసుకున్నారు. తమకు న్యాయం జరుగకుంటే కలెక్టరేట్ ముందు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు తెలిపారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ వారిని ఎస్పీ కార్యాలయానికి పంపించారు.