Share News

పాలమూరులో ఆర్మీ మద్యం దందా

ABN , Publish Date - Aug 22 , 2025 | 10:51 PM

పాలమూరులో ఆర్మీ మద్యం దందా సాగుతోంది. మద్యం తాగని సైనిక ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి సరకును తక్కువ ధరకు కొంటున్న దళారులు అనంతరం దానిని మార్కెట్‌ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

పాలమూరులో ఆర్మీ మద్యం దందా
ఆర్మీ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

గల్లికో వ్యాపారి..

మద్యం తాగని ఆర్మీ కుటుంబీకుల నుంచి సేకరించి విక్రయం

బల్క్‌గానూ అందుబాటులో

బాటిల్‌పై రూ.200-300 లాభం చూసుకొని అమ్మకం

తాజాగా రూ.90 వేల విలువ చేసే 33 మద్యం బాటిళ్ల పట్టివేత

జిల్లాలోకి భారీగా గోవా మద్యం దిగుమతి

పాలమూరులో ఆర్మీ మద్యం దందా సాగుతోంది. మద్యం తాగని సైనిక ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి సరకును తక్కువ ధరకు కొంటున్న దళారులు అనంతరం దానిని మార్కెట్‌ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు గోవా మద్యం కూడా జిల్లాలోకి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. గోవాకు వెళ్లే ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సుల ద్వారా, అక్కడ ఉంటున్న జిల్లాకు చెందిన వారు మద్యం ఇక్కడికి తీసుకొచ్చి, విక్రయిస్తున్నారు, విషయం తెలిసినా ఎక్సైజ్‌ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం గమనార్హం.

- మహబూబ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి)

పాలమూరు నగరంలో ఆర్మీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తద్వారా దళారులు నెలకు రూ.వేలల్లో సంపాదిస్తున్నారు. నగరంలో ఆర్మీ క్యాంటీన్‌ ఉంది. ఈ క్యాంటీన్‌ పరిధిలో ఆర్మీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగులకు వందల కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతీ నెల మద్యం కోటా వస్తోంది. వారి కార్డుపై కానిస్టేబుల్‌కు అయితే 4 బాటిళ్ళు, హెడ్‌ కానిస్టేబుల్‌ అయితే 6 మద్యం బాటిళ్ళు ఇస్తారు. అందులో చనిపోయిన వాళ్ళు ఉంటే కోటా సగా నికి తగ్గిస్తారు. వారిలో చాలామందికి మద్యం తాగే అలవాటు ఉండదు. అలాంటి వారినుంచి దళారులు మద్యం కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు వైన్స్‌లో 100 పైపర్స్‌ బాటిల్‌ ధర రూ.2,160 ఉండగా, ఆర్మీ క్యాంటీన్‌లో రూ.1,500లకు ఇస్తారు. ఆర్మీకి సంబంధించిన వారి నుంచి దళారులు రూ. 1,800లకు కొనుగోలు చేస్తారు. తర్వాత రూ. 2000లకు అమ్ముకుంటారు. అంటే వైన్స్‌లలో కొ నుగోలు చేసే మద్యం కన్నా బాటిల్‌పై రూ.160 తక్కువగా రావడంతోపాటు ఆర్మీ మద్యంలో కల్తీ ఉండదని భావించే చాలా మంది ఇలా దళారులను ఆశ్రయిస్తుంటారు. ఒకప్పుడు పాలమూరులో కొందరు మాత్రమే ఈ మద్యం విక్రయించేవారు. ఇప్పుడు పదుల సంఖ్యలో గల్లీకో వ్యాపారి వెలిశాడు. ఆర్మీ మద్యం అనగానే కల్తీ ఉండదని భావించే మందుబాబులు వాళ్ల అడ్రస్‌ వెతుక్కుంటూ వెళ్లి కొంటుండటంతో ఈ దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వ్యాపారికి 10-15 మంది ఉంటే చాలు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సంపాదించొచ్చు. ఫంక్షన్‌హాళ్లలో జరిగే మందు పార్టీలలో ఎక్కువగా ఆర్మీ మద్యం విని యోగిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఉండటంతో నిఘా చేసినట్లు తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

ఇప్పటికే గోవా నుంచి పెద్ద ఎత్తున మద్యం దిగుమతి అవుతోంది. గోవాలో సెటిల్‌ అయిన పాలమూరు వాసులు అక్కడినుంచి రాకపోకలు సాగించే సమయంలో మద్యం తెస్తుంటారు. అక్కడ తక్కువ ధర ఉండటంతో తీసుకువచ్చి, ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గోవాకు వెళ్లే ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సుల మాటున కూడా పెద్ద ఎత్తున మద్యం దిగుమతి అవుతోం ది. గోవా, ఆర్మీ మద్యం విచ్చలవిడి విక్రయాలతో తమ వ్యాపారానికి గండి పడుతోందని వైన్స్‌, బా ర్‌ల వ్యాపారులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్మీ మద్యం పాలమూరుకు వస్తోంది. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌ దీనిపై నిఘా ఉంచాల్సిందిగా ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించడంతో రెండు నెలల్లో రెండు కేసులు నమోదు చేశారు. అయితే ఆర్మీ మద్యం దందా చేసేవారి గురించి తెలిసినా అధికారులు వారి జోలికి వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి.

33 మద్యం బాటిళ్ల పట్టివేత

నగరంలోని పద్మావతి కాలనీకి చెందిన సుదర్శన్‌రెడ్డి ఇంట్లో వివిధ బ్రాండ్లకు చెందిన 33 బాటిళ్ల ఆర్మీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌ ఆదేశాలతో టాస్క్‌ ఫోర్స్‌ బృందం దాడులు చేసింది. అధికారుల విచారణలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల నుంచి మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి, మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తేలింది. కాగా మార్కెట్‌లో ఆర్మీ మద్యం విక్రయించేవాళ్ళు చాలామందే ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోకుండా ఒక వ్యక్తినే టార్గెట్‌ చేయడం వెనక రాజకీయ కోణం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. గత నెలలో ఢిల్లీకి చెందిన 30 బాటిళ్ల ఆర్మీ మద్యం పాలమూరు పరిసర ప్రాంతాలలో విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని జడ్చర్ల ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఆర్మీ మద్యం విక్రయిస్తే చర్యలు

ఆర్మీ మద్యం కేవ లం క్యాంటీన్‌లో ఆర్మీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉ ద్యోగులకు మాత్రమే విక్రయించాలి. ఈ మద్యం సొంతానికే వినియోగించాలి. ద ళారులకు విక్రయిస్తే విక్రయించిన ఆర్మీ ఉద్యోగులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డిఫెన్స్‌ మద్యంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం సరఫరా చేయడంపై జిల్లాలో నిఘా ఏర్పాటు ఉంచాము. ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహించే పార్టీలలోనూ డిఫెన్స్‌ మద్యం వినియోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పట్టుబడితే ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకులపైనా కఠిన చర్యలు తీసుకుంటాం.

- సుధాకర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

Updated Date - Aug 22 , 2025 | 10:52 PM